కర్నూలులో తొలిసారిగా 'తానా' కార్యక్రమాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటక పోటీలకు వేదికగా కర్నూలు జిల్లా నిలిచింది. కళల కాణాచియైన కర్నూలు జిల్లాలో తొలిసారిగా తానా జాతీయ స్థాయి నాటిక పోటీలను ఏర్పాటు చేశారు. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలునగరంలోని స్థానిక సీ.క్యాంపు సెంటర్‌లో ఉన్న టీజీవీ కళాక్షేత్రంలో వీటిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ నాటక సమాజాలుగా గుర్తింపు పొందిన ఎనిమిది నాటక సంస్థలు ఈ పోటీలలో పాల్గొన్నాయి.
గత నాలుగు దశాబ్దాలుగా కర్నూలులో పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు, జానపద, శాస్త్రీయ నృత్య కళారూపాలను ప్రదర్శిస్తూ లలిత కళాసమితి. రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళా సంస్థగా గుర్తింపు పొందింది. రాష్ట్రస్థాయి నాటక పోటీలను నిర్వహిస్తూ రంగస్థల నటులను ప్రోత్సహిస్తోంది. తానాతో కలిసి ఈ నాటకపోటీలను నిర్వహిస్తోంది.
తానా సహాయ కార్యదర్శి రవి పొట్లూరి మాట్లాడుతూ మొదటిసారిగా కర్నూలులో తానా నాటకపోటీలను నిర్వహిస్తోందని చెప్పారు. అమెరికాలో సాంస్కృతిక ప్రదర్శనలను ఇచ్చే తానా ఆంధ్రప్రదేశ్‌లో తన నాటక ప్రదర్శనలకు రాయలసీమలోని కర్నూలును వేదికగా చేసుకుందని తెలిపారు. ఈ నాటక ప్రదర్శనలను నిర్వహించేందుకు సహకరించిన లలిత కళాసమితి బృందాన్ని రవి పొట్లూరి అభినందించారు. తానా ప్రోగ్రామ్ కన్వీనర్ ముప్పా రాజశేఖర్ ఈ పోటీలను జయప్రదంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.