2 రాష్ట్రాల్లోనూ 'తానా' సేవలు - సతీష్ వేమన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ వేమన అన్నారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లకొకసారి తానా నిర్వహించే మహాసభ వచ్చే సంవత్సరం మే 28, 29 తేదీల్లో అమెరికాలో జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించామన్నారు. 20న రాజమండ్రిలో ఎంపీ మురళీమోహన్‌కు సన్మానం చేస్తామన్నారు. 26న హైదరాబాద్‌లో, 30న తెలంగాణలో పలుచోట్ల కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇటీవలే కొన్ని గ్రామాల్లో స్వచ్ఛ భారత్‌లో భాగంగా అనేక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు.
తానా ఏర్పడి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తానా చైతన్య స్రవంతి తరపున కొన్ని కార్యక్రమాలు చేపట్టామని స్రవంతి విజయవాడ కో-ఆర్డినేటర్ వేమూరి సతీష్ అన్నారు. 18వ తేదీ హెల్త్ క్యాంప్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించామని, నేడు కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. హోటల్ మురళీ ఫర్చ్యూన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. కంటి, క్యాన్సర్, లివరు తదితర సమస్యలకు పరీక్షలు చేశామన్నారు. వివిధ రకాల ప్రాచీన కళలతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.