ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటుకు 'తానా' సాయం
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేసేందుకు సహాయం చేస్తామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రకటించింది. అవసరమైన అన్ని గ్రామాలలోని శ్మశాన వాటికలకు ప్రహారీలు, రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు కూడా రూ.5వేల డాలర్లు చొప్పున సహాయం చేస్తామని కూడా తానా నాయకులు ప్రకటించారు. తానా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చిన తానా నాయకులు ఈ మేరకు హామి ఇచ్చారు.
కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ దత్త తీసుకున్న కక్షల గ్రామం కప్పట్రాళ్ల అభివృద్ధికి తానా సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తుందని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఎస్పీ వినతి మేరకు తానా నాయకుడు, జిల్లాకు చెందిన రవి పొట్లూరి సూచన మేరకు తానా ప్రతినిధులు వరుగా రెండో రోజు కూడా కప్పట్రాళ్లను సందర్శించారు. తొలిరోజైన శుక్రవారం హైదరాబాద్‌కు చెందినన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
రైతు కోసం తానా అనే కార్యక్రమాన్ని కూడా పెద్దఎత్తున నిర్వహించారు. ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ రైతులకు వ్యవసాయంలో వినియోగించే వ్యక్తిగత్త సంరక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు జంపాల చౌదరి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ వేమన, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరాం కోమటి, జాయింట్ సెక్రటరి రవి పొట్లూరి, కమ్యూనిటి ఆర్గనైజర్ అంజయ్య చౌదరి ఇతర ప్రతినిధులు గోవర్దన్‌రెడ్డి, రాజు సూరపనేని, గారపాటి ప్రసాద్, గోగునేని శ్రీనివాస్, ముప్పా రాజశేఖర్, రఘుమేక, లోకేష్‌నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఒక కక్షల గ్రామాన్ని బాగు చేసేందుకు ఒక ఐపిఎస్ అధికారి ఇంతగా పరితపించి పని చేయడం తమకెంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించందన్నారు. కప్పట్రాళ్ల కక్షల గురించి గతంలో తాము పత్రికల్లో చదివామని ఇక్కడి నాయకుడు (ఫ్యాక్షనిస్టు) వెంకటప్పనాయుడి ఇంటర్వ్యూలు చదివినట్లు పలువురు తానా ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు అదే గ్రామానికి రావడం ఎస్పి చొరవతో కక్షల గ్రామం ఎంతగానో మారిపోవడం సంతోషం కలిగిస్తోందని వారు పేర్కొన్నారు. సర్కారీ స్కూళ్లలో చదువుకుని అమెరికాలో ఉన్నత స్థానాలలో ఉన్న తాము జన్మభూమి రుణం తీర్చుకునేందుకు తమ సంపాదనలో కొంత ఇక్కడి గ్రామాల అభివృద్ధి, ప్రధానంగా విద్య వైద్యం కోసం వెచ్చిస్తూ 40 ఏళ్లుగా పాటు పడుతున్నట్లు తానా ప్రతినిధులు వివరించారు. కప్పట్రాళ్ల అభివృద్ధికి, నమూల మార్పుకు ఎస్పీ రవికృష్ణ చేస్తున్న కృషికి రానున్న కాలంలో తానా సంపూర్ణ సహయ సహకారం అందజేస్తుందని వారు ప్రకటించారు. ప్రతి రెండేళ్ల కోసారి గ్రామాన్ని తానా బృందం సందర్శిస్తుందని ప్రజలకు అవసరమైన కార్యక్రమాలకు తోడ్పాటులను అందిస్తామని ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ బృంద నాయకులు హామి ఇచ్చారు. విద్యతోనే వ్యక్తిగత, కుటుంబ, సమాజ అభివృద్ధి సాధ్యమని బాలబాలికలంతా కష్టపడి చదువుకుని ఎదగాలని తానా ప్రతినిధులు ఆకాంక్షించారు.
ఎస్పీ రవికృష్ణ వినతి మేరకు గ్రామంలో పొదపు మహిళల సౌకర్యం కోసం ఓ శ్రీశక్తి భవణ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తానా నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి ఏతల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటూ పాటపాడి తానా వారికి జన్మభూమిపై ఉన్న మమకారాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పునరుద్ఘాటించారు. పిల్లలను పెద్దలను గౌరవించాలన్న తన తండ్రి నేర్పిన నడవడికనే తాను నేటికీ అనుసరిస్తున్నానని చెప్పారు. వ్యక్తులను, సమాజాన్ని గౌరవించాలని సూచించారు. కన్నతల్లిని, జన్మభూమిని మరవరాదని హితవు పలికారు. రానున్న కాలంలో తాను ఎక్కడ విధులు నిర్వర్తించాల్సి వచ్చినా ప్రతి రెండు నెలలకోసారి కప్పట్రాళ్లకు వచ్చి వెళుతానని జిల్లాలో తన కుటుంబ గుర్తుందచుకునేది కొండారెడ్డి బురుజు, రెండోది కప్పట్రాళ్ల గ్రామమేనని చెప్పారు.