భళా...సతీష్ వేమన - రాజంపేటలో అంగరంగవైభవంగా 'తానా' వేడుకలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా నేడు (జనవరి 5వతేదీన) రాజంపేటలో నిర్వహించిన చైతన్యస్రవంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తానా అధ్యక్షుడు సతీష్ వేమన స్వస్థలమైన రాజంపేటలో ఎప్పటికీ అన్నమయ్య పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు.
తితిదే సహకారంతో దాదాపు 500మంది కళాకారులు రాజంపేట నుండి 5కిమీ దూరంలో ఉన్న అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో కళాకారులు ప్రదర్శించిన పలు కళారూపాలు ఆకట్టుకున్నాయి. అనంతరం తాళ్లపాకలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఎదుట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, కత్తి నరసింహారెడ్డి, తెలంగాణా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, సినీనటుడు సునీల్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గాయనీమణులు కొండవీటి జ్యోతిర్మయి, ఉష, శోభారాజు, తితిదే-అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన కళాకారులు పలు భక్తిగీతాలను ఆలపించారు.
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తానాలో ఉంటున్న తెలుగుబిడ్డలు రైతన్నల కోసం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయం అన్నారు. రైతులకు రక్షణగా ఉంటూ వారికి ఒక్కొక్కటి రూ.3 వేల విలువచేసే 30 వేల రక్షణ కిట్లను అందజేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రసాయన మందులు పిచికారి చేసేటప్పుడు విషవాయులతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని రైతు రక్షణ కిట్లను తానా అందజేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాజంపేట ప్రాంతంలో వెయ్యి మందికి రైతు రక్షణ కిట్లను అందజేయడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. భవిష్యత్తులో తాళ్లపాక అన్నమయ్య ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహించేలా తానా కృషి చేయాలని కోరారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు తానా ఎంతో కృషి చేస్తోందన్నారు. తానా కుటుంబ సభ్యులు ఎంతోమంది అమెరికా నుంచి రూ.కోట్లు ఖర్చు పెట్టుకుని ఇక్కడికొచ్చినట్లు చెప్పారు. తానా చరిత్రలో తొలిసారిగా రాయలసీమ ప్రాంతం నుండి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం తనకు లభించిందని, తనకు లభించిన పదవి ద్వారా ఈ ప్రాంతంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్నమయ్య పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో అన్నమయ్య ఉత్సవాలను ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధిపై తానా మరింత దృష్టి పెట్టాలన్నారు.
కళారంగానికి ఎంతోమంది మేధావులు అండగా నిలుస్తున్నారని, వారు ఆదరిస్తున్నారు కాబట్టే తాను నటుడిగా ఎదిగానని సినీ నటుడు సునీల్ చెప్పారు. అన్నమయ్య కీర్తనలతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఈ స్థాయికి ఎదగినట్లు వివరించారు.
కళారంగానికి విశిష్ట సేవలు అందించిన కళాకారులను తానా ఘనంగా సత్కరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టరు బి.విశ్వనాథ్, మాజీ డైరెక్టర్లు మేడసాని మోహన్, కె.శ్రీనివాసులు, అన్నమయ్య కీర్తనలతో భక్తులను ఓలలాడించిన శోభారాజ్, ప్రజలను భక్తి మార్గాన నడిపించిన ఆధ్యాత్మిక వేత్త జ్యోతిర్మయిని ఘనంగా సత్కరించారు.
చెక్కభజన, పండరిభజన, కోలాటంతో కళాకారులు కదం తొక్కారు. చైతన్య స్రవంతి కార్యక్రమంలో రాజంపేట ప్రాంతంలోని వెయ్యి మంది రైతులకు రైతు రక్షణ కిట్లను తానా అందజేసింది. తానా ప్రతినిధులు లావు అంజయ్య చౌదరి, నరేన్ కొడాలి, పొట్లూరి రవి, మందడపు రవి, బత్తిన రాకేష్-ప్రకాష్, సూరపనేని రాజా, తానా మహా సభల చైర్మన్ నరేన్ కొడాలి, కన్వీనర్ డా. మూల్పూరి వెంకటరావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.