ASBL Koncept Ambience

కృష్ణాజిల్లా, హనుమాన్‌ జంక్షన్‌లో తానా వేడుకలు...

కృష్ణాజిల్లా, హనుమాన్‌ జంక్షన్‌లో తానా వేడుకలు...

రైతులకు యంత్రాల పంపిణీ, ఉచిత నేత్ర వైద్యశిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తానా చైతన్యస్రవంతి కార్యక్రమంలో భాగంగా డిసెంబర్‌ 21వ తేదీన కృష్ణా జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌ పాలశీతలీకరణ కేంద్రంలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరితోపాటు, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పంత్రా, కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి, కృష్ణా మిల్స్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు, ముఖ్య అతిధిగా రామ్‌ వెనిగళ్ళ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు గడ్డి కత్తిరించు యంత్రాలను 100కు పైగా పంపిణీ చేశారు. రైతులకోసం 100రక్షణ పరికరాలను కూడా అందజేశారు. నేత్ర వైద్యశిబిరాన్ని నిర్వహించి ఎంతోమందికి కంటి పరీక్షలను నిర్వహించారు. తానా నాయకులతోపాటు, రైతు నెక్కంటి సుబ్బారావును సన్మానించారు. 

ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, తామంతా రైతు బిడ్డలమేనని తమ తల్లితండ్రులు వ్యవసాయం చేస్తున్నప్పుడు పడిన కష్టాలు తమకు ఇంకా గుర్తుందని రైతు కష్టంతో తామంతా చదివి ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పటికీ రైతులకు ఏదైనా మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తానా తరపున రైతుకోసం పలు కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. జిల్లాలో పాడిపరిశ్రమను నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రస్తుతం గడ్డిని పండిరచేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోవడం బాధగా ఉందని అంటూ, రైతులకు గడ్డిని కోసే యంత్రాలను అందించడం ద్వారా వారి కష్టాలను తగ్గించే ప్రయత్నాన్ని తానా తరపున చేస్తున్నామని చెప్పారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి రైతులంతా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి కృష్ణా మిల్క్‌ యూనియన్‌ బాగా పనిచేస్తోందని ప్రశంసించారు.   

తానా కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి మాట్లాడుతూ, తామంతా రైతు పడిన కష్టాలను స్వయంగా చూసినవారమని, మా నాన్న వ్యవసాయం చేసినప్పుడు పడ్డ కష్టం, మా అమ్మ పాలు అమ్మి మమ్మల్ని చదివించిన సంగతిని గుర్తు చేసుకుంటూ, జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధికి, రైతు బాగుకోసం తామంతా కృషి చేస్తున్నామని, తానా తరపున రైతు సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మదర్స్‌ డెయిరీకి పాలు అమ్మితే  ఆ డబ్బులు గుజరాత్‌కు వెళ్తాయని, అదే మన కృష్ణాజిల్లా మిల్క్‌ యూనియన్‌కు అమ్మితే ఆ డబ్బులు మనకే ఉపయోగపడుతాయని చెప్పారు. 

కృష్ణా జిల్లా మిల్స్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ, అమెరికాలో స్థిరపడినా రైతు కుటుంబానికి చెందిన వీళ్ళంతా ఇక్కడకు వచ్చి రైతులకు సహాయం అందించడం ఎంతో ప్రశంసనీయమైన విషయమని చెప్పారు. వారికి కూడా మనవంతు సహకారాన్ని అందించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో తానా నాయకులు సతీష్‌ వేమూరి, శశికాంత్‌ వల్లేపల్లి, పురుషోత్తం చౌదరి, శశాంక్‌ యార్లగడ్డ, రఘు ఎదులపల్లి, వెంకట రమణ గన్నె, ఠాగూర్‌ మలినేని, శ్రీనివాస్‌ కూకట్ల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, ప్రశాంత్‌ కాట్రగడ్డ, విష్ణు దోనెపూడి తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Event Gallery

 

 

 

Tags :