కోట వంశీ సహకారంతో గుంటూరులో తానా మెగా వైద్య శిబిరం విజయవంతం
4వేల మంది పేదలకు ఉచిత వైద్య సేవలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకరాంతో ప్రవాహ భారతీయుడు, వ్యాపారవేత్త కోట వంశీ ఆర్థిక సహకారంతో గుంటూరులోని ఏసీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. దాదాపు నాలుగు వేల మంది పేదలకు ఈ వైద్యసేవలు అందాయి.ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని హైకోర్టు జడ్డి జస్టిస్ జీ రామకృష్ణ ప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు. మానవసేవే మాధవ సేవని నిరూపించిన తానా, గ్రేస్ ఫౌండేషన్ నిర్వాహకులు, కోట వంశీకి ఆయన అభినందనలు తెలిపారు. దేశంలో విద్య, వైద్యమనేది ప్రజల ప్రాథమిక హక్కని స్పష్టం చేశారు. ఎందరో పేదలు కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేకపోతున్నారని, అలాంటి వారికి ఈ వైద్య శిబిరం ఒక వరమని పేర్కొన్నారు. వైద్య శిబిరానికి నాలుగు వేల మంది పేదలు రావడం సంతోషంగా ఉందన్నారు. మాతృభూమి రుణం కొంతైనా తీర్చుకోవాలనే తలంపు రావడం, దీనిని ఆచరణలో చేసి చూపడం చాలా గొప్ప విషయమని చెప్పారు.
టుబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఇన్ని వేల మంది రావడం ఆనందంగా ఉందన్నారు. వైద్యులు సేవాభావంతో వ్యవహరించడం చాలా ముదావహమని పేర్కొన్నారు. వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు కల్పించటమ్ గొప్ప విషయమని వంశీ ని అభినందించారు.
ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ ఎందరో పేదలకు ఆరోగ్యశ్రీ సంజీవనిలా పని చేస్తుందని తెలిపారు. అయితే అన్ని రకాల వైద్యసేవలను ఒకే చోటికి తీసుకొచ్చి ఉచిత వైద్యమందించడం ద్వారా కోట వంశీ చాలా గొప్ప కార్యం చేపట్టారని తెలిపారు.
ఈ సందర్భంగా కోట వంశీ మాట్లాడుతూ తమ అనారోగ్యాన్ని జయించి పేదలు చిరునవ్వులతో వెళుతున్నప్పుడు పొందే ఆనందం వెలకట్టలేనిదని చెప్పారు.ఈ మెగా వైద్య శిబిరంలో 27 మంది స్పెషలిస్టు వైద్యులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చి సేవలందించారని వెల్లడిరచారు. ఇతర వైద్య సిబ్బంది 150 మంది వరకు ఉన్నారని, అవసరమైన వారందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. మొత్తం రూ.42 లక్షల రూపాయలతో నాలుగు వేల మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందించే భాగ్యం కలగడం తన అదృష్టమని పేర్కొన్నారు.
తానా ప్రెసిడెంట్ లావు అంజయ్య చౌదరి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినబాబు మాట్లాడుతూ ఇంతటి మహోన్నత కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం, దీనికి కోట వంశీ సహకారం అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్విహిస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో జీపీ ఇండస్ట్రీస్ చైర్మన్ గోరంట్ల పున్నయ్య చౌదరి, డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, రావి గోపాలకృష్ణ, రవి పొట్లూరి, విధ్యాధర్ గారపాటి, వెంకట్ పొత్తూరు, వెంకట్ గన్నె, క్రాంతి ఆలపాటి, యర్రా నాగేశ్వరరావు, రమేష్ చంద్ర, ఘంటా పున్నయ్య చౌదరి, శ్రీధర్ నాగళ్ల, ఏసీ కాలేజీ ప్రిన్సిపాల్ కే మోజెస్, ట్రెజరర్ మోజెస్ ఆర్నాల్డ్ తదితరులు పాల్గొన్నారు. అతిథులను, తానా సభ్యులను వంశీ సత్కరించారు.