మద్దూరులో ఘనంగా తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలు
అన్నదాత శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలం పుడమిని నమ్ముకున్న అన్నదాత శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలమని ఈ సంకల్పంతోనే రైతు కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సేవా సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి అన్నారు. తానా అడ్‌హక్ కమిటీ సభ్యుడు పుసులూరి సుమంత్ ఆధ్వర్యంలో మద్దూరులో రైతు కోసం తానా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం విద్యార్థులకు ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఇద్దరు విద్యార్థులకు సైకిళ్లు అందించారు. అనంతరం క్యాన్సర్ శిబిరంలో మందులు అందజేశారు. రైతు సదస్సులో రూ.లక్ష విలువైన సామగ్రిని అందించారు. ఆదర్శంగా వ్యవసాయం చేస్తున్న రైతులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఇతర సేవా కార్యక్రమాలను కోట్లాది రూపాయలతో చేస్తున్నామన్నారు. సుమంత్ సొంత ఊరికి చేస్తున్న సేవలను కొనియాడారు. అతిథిగా కొవ్వూరు పురపాలక మాజీ చైర్మన్ సూరపనేని చిన్ని, నాయుడు వీర్రాజు, పుసులూరి శ్రీహరిరావు, రామకృష్ణ, గంగాధర్, శ్రీనివాస్, నారాయణ, సూర్య దేవర రంజిత్, చెరుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.