ASBL Koncept Ambience

‘తానా’ కార్యక్రమాలు అందరికీ గర్వకారణం...

‘తానా’ కార్యక్రమాలు అందరికీ గర్వకారణం...

అమెరికాలో ఉంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారు స్వదేశంపై మక్కువతో ఎంతో శ్రమకు ఓర్చి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. విపిఆర్‌ కన్వెన్షన్‌ హాలులో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన నెల్లూరులో తానా వారు చైతన్యస్రవంతి పేరుతో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేందుకు సంబరాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. విదేశాల్లో ఉంటున్న నెల్లూరీయులు జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

భారతీయ సంప్రదాయాలను ఇంకా పాటిస్తున్నారనేందుకు తానా నిర్వహిస్తున్న సంబరాలే నిదర్శనమని ఎమెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారు తమ సాంప్రదాయాలను మరచిపోరాదన్నారు. తెలుగువారికోసం విదేశాల్లో ఉన్న తెలుగువాళ్ళ గుండెలు ఎంతగా తపిస్తున్నాయో ఇక్కడ జరిగిన కార్యక్రమాలను చూస్తే అర్థమవుతోందన్నారు.

ఘనమైన నెల్లూరు చరిత్రను తెలియజేయడంతోపాటు, మన సంస్కృతీ, సంప్రదాయాలను, కళలను రేపటితరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు తానా సంబరాల కమిటీ చైర్మన్‌ రవి సన్నారెడ్డి తెలిపారు. నెల్లూరీయులు ఎంతోమంది విదేశాల్లో ఉన్నారని ఎవరు ఎక్కడ ఉన్నా తెలుగు భాషను సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.

ప్రపంచంలోనే నెల్లూరు భాష యాసకు ఒక ప్రత్యేక స్థానం ఉందని ఐదు నిముషాలు మాట్లాడితే చాలు నెల్లూరువారనే విషయం ఇట్టే తెలిసిపోతుందని ఎపిఐఐసి చైర్మన్‌ కృష్ణయ్య అన్నారు. నెల్లూరు సంప్రదాయ వంటకాలకు వివిధ దేశాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇక్కడి మొలగొలుకుల బియ్యం చాలా ప్రసిద్ధి చెందిదన్నారు.

నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని కలిగించే విధంగా చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసే విధంగా కార్యక్రమాలను రూపొందించడం హర్షదాయకమన్నారు. సంక్రాంతి అనంతరం జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు అందరి సహకారంతో తెలుగు పండుగను నిర్వహిస్తామని చెప్పారు. జెసి రేఖారాణి మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న తెలుగువారిని చూస్తుంటే వారిలో స్వార్థం లేదనిపిస్తోందన్నారు. వారు ఇండియాకు వచ్చి డబ్బులు ఖర్చు చేసి మనకోసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.

అమెరికాలో నలభై ఏళ్ళకుపైగా స్థిరపడినా తెలుగు సంప్రదాయాలను మరచిపోకుండా మహాసభలు, కార్యక్రమాల  ద్వారా తెలుగు వారందరికి, నేటితరానికి గుర్తుండిపోయేలా ఎన్నో కార్యక్రమాలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేస్తోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో తుంగ శివ ప్రభాత్‌ రెడ్డి, రావి మోహన్‌ చౌదరి, మైథిలి, మనోహర్‌ రెడ్డి, బెజవాడ నరేష్‌ చంద్రారెడ్డి, ఎన్‌. బలరామయ్య నాయుడు, మాజీ ఎమ్మెల్యే బిద మస్తాన్‌ రావు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తానా నుంచి తానా అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని, ఉపాధ్యక్షుడు జంపాల చౌదరి, కార్యదర్శి సతీష్‌ వేమన, ట్రెజరర్‌ మధుతాతా, మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, నాదెళ్ళ గంగాధర్‌, లావు అంజయ్య చౌదరి, రవి గౌరినేని, రజని ఆకురాతి, వాసుదేవ రెడ్డి చిన్నా, రవి పొట్లూరి, గౌతమ్‌ గుర్రం, రామ్‌ జక్కపూడి, నరేంద్ర ఏలూరు, హరిత చదివె, రామ్‌ యలమంచిలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

View Event Gallery Part-1                                                     View Event Gallery Part-2 

 

Tags :