ASBL Koncept Ambience

పెనుగంచిప్రోలులో రైతులకు రక్షణ పరికరాల పంపిణీ

పెనుగంచిప్రోలులో రైతులకు రక్షణ పరికరాల పంపిణీ

తెలుగు రాష్ట్రాల రైతుల అభివృద్ధికి తానా శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ నల్లూరి ప్రసాద్‌ తెలిపారు. పెనుగంచిప్రోలుకు చెందిన ఎన్నారై కర్ణ నాగశేషు సహకారంతో నూతలపాటి కన్వెన్షన్‌ హాలులో రైతుకోసం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమెరికాలో తెలుగువారికి ఏ ఇబ్బందులు వచ్చినా వారికి తక్షణ సాయం అందించడానికి 600 మంది తానా కార్యకర్తలు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారని ఆయన వివరించారు. తెలుగు భాషా సంప్రదాయాల పరిరక్షణకు కూడా తానా విశేష కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 350 మందికి రైతు రక్షణ పరికరాలను అందజేశారు.

తానా సభ్యుడు రవి మందలపు మాట్లాడుతూ మాృతభూమి కోసం తానా ఎంతగానో పాటుపడుతోందన్నారు. రైతుకోసం కార్యక్రమం కన్వీనర్‌ జానయ్య మాట్లాడుతూ పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు రైతులు అనారోగ్యం పాలవకుండా చూసేందుకే తాము రైతు రక్షణ పరికరాలను అందిస్తున్నామని చెప్పారు. జూలైలో జరగనున్న తానా సభలకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు రైతులను తీసుకువెళ్ళి అక్కడి వ్యవసాయ పరిస్థితులపై అవగాహన కల్పిస్తామన్నారు.

 

Tags :