వీరవల్లిలో ఘనంగా 'తానా' సేవా కార్యక్రమాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రయోజనకరంగా ఉన్నాయని కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. రైతు కోసం, మహిళ కోసం, చదువు కోసం, ఆరోగ్యం కోసం కార్యక్రమంలో భాగంగా వీరవల్లిలో తానా అధ్యర్యంలో రైతులకు రక్షణ కిట్లు, మహిళలకు కుట్టు యంత్రాలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఎన్నారై సుకుర్తి రాజా చొరవతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
వంశీ, అనూరాధ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు సతీష్ వేమన అధ్యక్షతన జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వంద మంది రైతులకు పొలాల్లో రసాయనాలు పిచికారీ చేసే సమయంలో రక్షణగా ఉపయోగపడే వస్తువులు, 30 మంది మహిళలకు కుట్టు యంత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు రూ.1,500 కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 30 వేలకుపైగా రైతు రక్షణ కిట్లు పంపిణీ చేశామని తెలిపారు.
అంతకుముందు తానా ప్రతినిధులు ఎడ్లబండిపై సహకార సంఘం అధ్యక్షుడు లంక సురేంద్ర నివాసం నుంచి ఊరేగింపుగా వచ్చారు. జడ్పీ పాఠశాలలో ప్రవాస భారతీయురాలు నవీన సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని ప్రారంభించారు.
ఎంపీపీ తుమ్మల కోమలి, తానా ప్రధాన కార్యదర్శి లావు అంజయ్య చౌదరి, సభ్యులు పొట్లూరి రవి, కోటా జానయ్య, జలవనరులశాఖ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, న్యాయవాది, దాత లింగమనేని రాజారావు, కలపాల శ్రీధర్, గుండపనేని ఉమా ప్రసాద్, పిల్లా రామారావు, అమృతపల్లి సూర్య నారాయణ, లింగమనేని చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.