నెల్లూరులో అంబరమంటిన ‘తానా’ వేడుకలు
తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలు, కళలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి భావితరానికి మన కళల వైభవాన్ని చాటి చెప్పేందుకు ఏర్పాటు చేసిన ‘తానా చైతన్య స్రవంతి’ కార్యక్రమం నెల్లూరులో ఘనంగా జరిగింది. అంబరమంటేలా ఈ చైతన్యస్రవంతి వేడుకలు జరిగాయి. నెల్లూరులోని విపిఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ వేడుకలకు జిల్లా నుంచి ఎంతోమంది ప్రముఖులు, అమెరికా నుంచి వచ్చిన తానా ప్రతినిధులు, ఇతర ఎన్నారైలు, స్థానిక కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు,పెద్దలు ఇతరులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 2015 జూలైలో డిట్రాయిట్‌లో తానా 20వ మహాసభలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల తానా ఆధ్వర్యంలో చైతన్యస్రవంతి పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
నెల్లూరులో జరిగిన తానా చైతన్యస్రవంతి వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో పెద్దగా జరిగి జయప్రదమైంది. తానా చైతన్యస్రవంతి వేడుకలకు చైర్మన్‌గా వ్యవహరించిన రవి సన్నారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఇక్కడ జరిపారు. మరుగున పడిపోతున్న జానపద కళలను ప్రోత్సహించే విధంగా కన్వెన్షన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ వచ్చినవారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. జానపద కళలతోపాటు తెలుగు ఆటల గురించి నేటితరానికి తెలియజేసేందుకు సంప్రదాయ గ్రామీణ క్రీడలైన వామనగుంటలు, బొంగరాలు, తొక్కుడు బిళ్ళ, బిళ్ళంగోడు, కబడ్డీ తదితర ఆటలను ప్రదర్శించారు.
భారతీయ సంస్కృతిలో భాగమైన గంగిరెద్దుల విన్యాసాలు, కర్రసాము, కీలుగుర్రాల నృత్యాలు, నెమలి నృత్యాలు, పండరి భజనలు, తప్పెట్ల విన్యాసాలు, ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పుస్తకాల ప్రదర్శన జరిగింది. నెల్లూరుకు చెందిన పలువురు సూక్ష్మ చిత్రకళాకారులు రూపొందించిన కళా వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్ కూడా ఆకట్టుకుంది. పాతకాలం నాటి నాణెలు, వివిధ దేశాల కరెన్సీ నోట్ల ప్రదర్శన వంటివి కూడా వచ్చినవారిని ఆసక్తిగా తిలకించేలా చేశాయి.
సాహిత్య సాంస్కృతిక, పత్రికారంగం, వ్యవసాయ రంగాల్లో విశేషంగా కృషి చేసిన పలువురిని తానా నాయకులు ఘనంగా సన్మానించారు. పేద, వృద్ధులైన కళాకారులు, పాత్రికేయులు, రైతులకు 10వేల రూపాయల ఆర్థిక పురస్కారాలను అందజేశారు. టీవీ కళాకారుల బృందం చంటి, పడవల సుధాకర్ తదితరులు నిర్వహించిన హాస్యవల్లరి అందరినీ ఆకట్టుకుంది. నగరానికి చెందిన పలువురు కవులు హాస్యకవి సమ్మేళనంలో పాల్గొని కవితాగానం చేశారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులతోపాటు వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
మా తెలుగు తల్లికి, వందేమాతరం గీతాల నృత్యం, శాస్త్రీయ, జానపద, సినీగీతాలకు చిన్నారులు చేసిన నృత్యాలు కనువిందు చేశాయి. విద్యార్థులు గానం చేసిన తెలుగు పద్యాలు, అన్నమాచార్య సంకీర్తనలు, నాశికా వేణుగానం, రాజస్థాన్ నృత్యాలు, యోగా, శివతాండవ నృత్యం, తెలుగు వెలుగు రూపకం, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఏకపాత్రాభినయం రామాయణంలో కైక ఏకపాత్రాభినయంతోపాటు దీపాల నృత్యం, పేరిణి నృత్యం, ధ్వన్యనుకరణ, కృష్ణశబ్దం, లవకుశ చిత్రాల్లోని పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు, గ్రామ దేవత నృత్యం, కోలాటాలు, పండరి భజనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినీ గాయనీ గాయకులు ప్రణతి గంగాధర్ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి పరవశింపజేసింది.
View Event Gallery Part-1 View Event Gallery Part-2