ఏలూరు జిల్లాలో తానా సేవలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు తమవంతుగా సేవలందించేందుకు వీలుగా తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత పాఠశాలలో తానా చైతన్య స్రవంతి, కొర్రపాటి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. క్యాన్సర్, కంటి, వినికిడి, గుండె, ఊపిరితిత్తులు, గైనిక్, మూత్రకోశ, సాధారణ వ్యాధులకు సంబంధించి రోగులకు నిపుణులతో వైద్య సేవలు అందించారు. రెండు వేలకు పైగా పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా అంజయ్య చౌదరి మాట్లాడుతూ జనవరి 7 వరకు రెండు తెలుగు రాస్ట్రాల్లో తానా ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో మరో 100 నిర్వహించనున్నట్లు తెలిపారు. రూ.లక్షల వ్యయంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
కొర్రపాటి ఫౌండేషన్ చైర్మన్ కొర్రపాటి రామారావు మాట్లాడుతూ ఎక్కడినుంచో వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న వారిని చూసి స్ఫూర్తిపొందాలన్నారు. స్వయం కృషితో ఎదిగిన వారు తానా పౌండేషన్‌కు సహకారం అందించాలన్నారు. అనంతరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు వివిధ పరీక్షలు చేసి కొర్రపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఔషధాలను పంపిణీ చేశారు. కొర్రపాటి సుధాకర్ సహకారంతో 10 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఉపకార వేతనాలు, ఐదుగురు రైతులకు పవర్ స్ప్రేయర్లు, మరో 20 మందికి ఇతర వ్యవసాయ పరికరాలు, 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 10 మంది విద్యార్థులకు సైకిళ్లు తానా డైరెక్టర్ నిమ్మలపూడి జనార్ధన్ ఓ ఇంజినీరింన విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేశారు. తానా చైతన్య స్రవంతికి సహాకరం అందించిన సుధాకర్, పాఠశాల ప్రిన్సిపల్ నందిగం రాణిని తానా సభ్యులు అభినందించారు. వైద్యులు ఈడ్పుగంటి మౌనిక, కొర్రపాటి ప్రియాంక, గొట్టిపాటి నాగార్జున, కొర్రపాటి హేమసుందర్ శిబిరంలో సేవలు అందించి రోగులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, తానా డైరెక్టర్ నిమ్మలపూడి జనార్దన్, మహిళా కో ఆర్డినేటర్ కటిక ఉమా, ఫౌండేషన్ ట్రస్టీ ఓరుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.