ASBL Koncept Ambience

''తానా'' చైతన్య స్రవంతి కార్యక్రమాలు

''తానా'' చైతన్య స్రవంతి కార్యక్రమాలు

అమెరికాలో మూడు దశాబ్దాలకుపైగా తెలుగు కమ్యూనిటీకి విస్తృతంగా సేవలందిస్తూ, మరోవైపు తెలుగు భాష, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి విస్తరణకు కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాతృరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అనేక కార్యక్రమాలను చేస్తోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి అమెరికాలో పెద్దఎత్తున తానా మహాసభలను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కళాకారులను, తెలుగు ప్రముఖులను ఈ మహాసభలకు ఆహ్వానించడం ద్వారా అమెరికాలో తెలుగు వైభవాన్ని మహాసభల ద్వారా తానా తెలియజేస్తోంది. ఈ మహాసభలకు ముందుగా మాతృరాష్ట్రంలో ‘చైతన్య స్రవంతి’ పేరుతో తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించేలా, మరుగునపడిన జానపదకళలను వెలుగులోకి తీసుకు వచ్చేలా తానా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

భాషలు, సంస్కృతులు, కళలు, సంప్రదాయాలు అమెరికాలో ఉన్న నేటితరానికి తెలియజేయడమే లక్ష్యంగా నిర్వహించే కార్యక్రమాల్లో తానా చైతన్య స్రవంతి ఒకటి. సాంస్కృతిక కళా కార్యక్రమాలతోపాటు పలు చోట్ల వైద్యశిబిరాలను నిర్వహించి పేదలకు ఆరోగ్య సదుపాయాన్ని కూడా తానా అందిస్తోంది. 2014 డిసెంబర్‌ లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉచిత వైద్య శిబిరాలతోపాటు, జానపద కళల ప్రదర్శనలు, సంగీత విభావరి, సాంస్కృతిక ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ఖమ్మం, నర్సాపురం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్దఎత్తున ఏర్పాటు  చేశారు. తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశాము. డిసెంబర్‌ 10,11 తేదీల్లో గుంటూరు జిల్లాలోని చిలువూరులో, 13-14 తేదీల్లో ఖమ్మం జిల్లాలోని పిండిప్రోలులో, డిసెంబర్‌ 21న కృష్ణా జిల్లాలోని పెద్దఅవుట పల్లిలో తానా సర్వీస్‌ డే పేరుతో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 27వ తేదీన కృష్ణా జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌ లో మెగా హెల్త్‌ క్యాంప్‌ ను నిర్వహిస్తున్నారు. 

డిసెంబర్‌ 11వ తేదీ నుంచి తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. హైదరాబాద్‌ లోని భారతీయ విద్యాభవన్‌లో జరిగే  తొలి  కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ముఖ్య అతిధిగా వస్తున్నారు. ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, బంగారు లక్ష్మణ్‌ ఇతర రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో అతిధులుగా హాజరవుతున్నారు. గాయకుడు రామాచారి నిర్వహిస్తున్న లిటిల్‌ మ్యుజిషియన్స్‌ అకాడమీకి సొంత భవనం నిర్మాణంకోసం తానా సేకరించిన దాదాపు 75 వేల డాలర్లను విరాళంగా ఈ కార్యక్రమంలో  అందించనున్నాము. లిటిల్‌ మ్యుజిషియన్స్‌ అకాడమీ పిల్లలతో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన కళాకారులను సన్మానించనున్నారు. డా. పి. ఆలేఖ్య (నృత్యం), శ్రీమతి నిత్యసంతోషిణి (సంగీతం), డా. చుక్కా సత్తయ్య (ఒగ్గుకథ), జె.కె. భారవి (సాహిత్యం), అంపశయ్య నవీన్‌ (సాహిత్యం), బివిఆర్‌ చారి (శిల్పం) ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపుతో తానాకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని, కళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఆయన శిలావిగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. డిసెంబర్‌ 15వ తేదీన ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ సందర్భంగా చిన్నారులకు చిత్రలేఖనంలో పోటీలను కూడా ఏర్పాటు చేశారు. బాపు-రమణ ఫిలిం ఫెస్టివల్‌, మ్యూజికల్‌ కన్సర్ట్‌ కూడా జరుగుతుంది. 

నెల్లూరులో ఆంధ్ర, రాయలసీమల జానపద కళోత్సవాలను డిసెంబర్‌ 18వ తేదీన ఏర్పాటు చేశారు. నెల్లూరులోని కస్తూరిబా ఆడిటోరియంలో ఈ జానపద కళోత్సవాలు జరగనున్నాయి. రవిరెడ్డి సన్నా రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు భాషకు సేవ చేసిన వారికి తానా ఇచ్చే తానా గిడుగు రామ్మూర్తి అవార్డును ప్రముఖ రచయిత రవ్వా శ్రీహరికి ఈ కార్యక్రమంలోనే అందజేయనున్నారు.

విజయవాడలోని సిద్ధార్థ ఆర్ట్స్‌, సైన్స్‌ కాలేజీ ఆడిటోరియంలో తానా కల్చరల్‌ ఫెస్టివల్‌ను డిసెంబర్‌ 21వ తేదీన నిర్వహిస్తున్నారు. యువతలో జానపద కళోత్సవ చైతన్యం పేరుతో యూత్‌కు అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముప్పవరపు మురళీ ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరించనున్నారు. జనవరి 2వ తేదీన విజయవాడలో జరిగే బుక్‌ ఫెయిర్‌లో తానా ప్రచురించిన కథల పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. 

 

Tags :