కర్నూలులో పేదలకు 'తానా' దుప్పట్ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలులోని పేదలకు దుప్పట్లను పంపిణీ చేసింది. డిసెంబర్ 17వ తేదీ అర్థరాత్రి నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసి బస్టాండ్, బళ్ళారి చౌరస్తా పరిధిలో రహదారి పక్కన నిద్రిస్తున్న పేదలకు ఎస్.పి. రవికృష్ణతో కలిసి తానా సంయుక్త కార్యదర్శి రవి పొట్లూరి, కార్యక్రమ కన్వీనర్ ముప్పా రాజశేఖర్ దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు పేదలు తానాకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్‌పి మాట్లాడుతూ, ఉన్నతాశయాలతో తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని చెప్పారు. 23,24 తేదీల్లో కప్పట్రాళ్ళ గ్రామంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు, రైతులకు రక్షణ పరికరాలు ఇతర కార్యక్రమాలను చేస్తున్నారని చెప్పారు.
తానా నాయకుడు రవి పొట్లూరి మాట్లాడుతూ, రోడ్డుపక్కన నిద్రిస్తున్న అభాగ్యులు చలితో ఇబ్బందులు పడుతుండటంతో వారికి దుప్పట్లను అందజేయడం ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు. మంచి కార్యక్రమానికి ఎస్‌పి ఇచ్చిన సూచనలు చేయూతకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.