తానా ఎన్నికలు... బరిలో నిలిచిన అభ్యర్థులు
అమెరికాలో తెలుగువాళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో పలువురు ఆశావహులు తాము పోటీ చేస్తున్న పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి తానాలో అన్నీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు వరకు (ఫిబ్రవరి 15) వరకు అందిన సమాచారం మేరకు అన్నీ పదవులకు పోటీ ఖాయమైంది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో 29 పదవులకు, బోర్డ్ డైరెక్టర్‌లోని 3 పదవులకు, ఫౌండేషన్‌లోని 7 ట్రస్టీ పదవులకు ఎన్నికలు జరుగుతున్నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఈ ఎన్నికల కమిటీకి చైర్మన్‌గా కనకం బాబు ఇనంపూడి, సభ్యులుగా ఆంజనేయులు కోనేరు, రాజా ముత్యాల ఉన్నారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 22. ఫిబ్రవరి 25న నామినేషన్ల తుదిజాబితా విడుదలవుతుం డటంతో ఆ సమయంలోగా ఎవరు బరిలో నిలవనున్నారో, ఎవరు నామినేషన్‌ను ఉపసం హరించుకుంటున్నారన్న విషయాలన్ని తేటతెల్లమవుతాయి. ఈసారి ఎన్నికలు మాత్రం తానా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటాపోటీగా జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి నామినేషన్ వేసిన వారి అభ్యర్థుల వివరాలను ఇక్కడ ఇస్తున్నాము.
తానా అధ్యక్ష పదవికి నిరంజన్ శృంగవరపు, నరేన్ కొడాలి, శ్రీనివాస గోగినేని పోటీ పడుతున్నారు. తానా కార్యదర్శి పదవికి సతీష్ వేమూరి, భక్తబల్లా పోటీ చేస్తున్నారు. తానా ట్రెజరర్ పదవికి అశోక్‌బాబు కొల్లా, జగదీశ్ ప్రభల పోటీ పడుతున్నారు. తానా జాయింట్ సెక్రటరీ పదవికి వెంకట్ కోగంటి, మురళీ తాళ్ళూరి పోటీ చేస్తున్నారు. తానా జాయింట్ ట్రెజరర్ పదవికి సునీల్ పాంత్రా, భరత్ మద్దినేని పోటీ పడుతున్నారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి రజనీకాంత్ కాకర్ల, రాజా కసుకుర్తి పోటీ చేస్తున్నారు. తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పదవికి శశాంక్ యార్లగడ్డ పోటీ చేస్తున్నారు. తానా ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి ఉమ కటికి పోటీ చేస్తున్నారు. తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ పదవికి హితేష్ వడ్లమూడి పోటీ పడుతున్నారు. రీజినల్ రిప్రజెంటెటివ్ పదవులకు కూడా పలువురు పోటీ పడుతున్నారు. కాలిఫోర్నియా రీజియన్‌కు రామ్‌తోట, మిడ్ అట్లాంటిక్ రీజియన్‌కు సునీల్ కోగంటి, శశిధర్ జాస్తి, డిఎఫ్‌డబ్ల్యు రీజియన్‌కు సతీష్ కొమ్మన, న్యూజెర్సి రీజియన్‌కు వంశీ వాసిరెడ్డి, పద్మ లక్ష్మి తదితరులు పోటీ చేస్తున్నారు.
తానా బోర్డ్ పదవులకు రవి పొట్లూరి, సతీష్ వేమన, జాని నిమ్మలపూడి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తానా ఫౌండేషన్ ట్రస్టీ పదవులకు శ్రీనివాస్ ఓరుగంటి, సత్య నారాయణ మన్నె, విద్యా గారపాటి తదితరులు పోటీ పడుతున్నారు. వీరితోపాటు పలువురు కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఎవరూ పోటీలో ఉన్నారో, ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికవుతారన్న విషయం తేలుతుంది. కాగా ఈసారి అన్నీ పదవులకు అభ్యర్థులు భారీగా పోటీ పడుతుండటంతో తానా ఎన్నికలు ఈసారి ఎన్నడూ లేని విధంగా హాట్‌హాట్‌గా సాగనున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని అటు సామాజిక మాధ్యమంలోనూ, టీవీలలోనూ ముమ్మరం?చేశారు. మరోవైపు ఇతర అభ్యర్థులు కూడా తమ గెలుపుకోసం తానా మెంబర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికలకు సంబంధించి తెలుగు టైమ్స్ వెబ్‌సైట్ https://www.telugutimes.net/news-folders/tana-elections-2021 లో కూడా ప్రత్యేక ఫోల్డర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో తానా ఎన్నికల స్పెషల్ స్టోరీలు, పోటీ పడుతున్న అభ్యర్థుల వివరాలను ఎప్పటికప్పుడు ఉంచడం జరుగుతుంది.