తానా ఎన్నికల బ్యాలెట్ల పంపిణీ...దృష్టి సారించిన అభ్యర్థులు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో భాగంగా సభ్యులకు బ్యాలెట్ పత్రాలను పోస్టులో పంపించారు. ఏప్రిల్ 30వ తేదీన సియాటెల్ నుంచి బ్యాలెట్‍లను స్వతంత్ర సంస్థ పోస్ట్ చేసింది. అంతకుముందు బ్యాలెట్‍లపై వచ్చిన ఆరోపణలను, వివాదాలను తానా బోర్డ్, ఎన్నికల కమిటీ చర్చించిన తరువాత ఓ జాబితాను అధ్యక్ష అభ్యర్థుల ముందు పెట్టింది. అధ్యక్ష అభ్యర్థులు డా.నరేన్ కొడాలి, నిరంజన్ శృంగవరపు, గోగినేని శ్రీనివాసలు అంతర్జాలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సియాటెల్‍కు చెందిన ఎలక్షన్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన బ్యాలెట్లను తనిఖీ చేసిన అనంతరం వీటిని తపాలా శాఖకు బదిలీ చేశారు.
దీంతో తానా 2021 ఎన్నికల్లో బ్యాలెట్ల విషయంలో ఏర్పడిన సందిగ్ధత, ఆలస్యం ఎట్టకేలకు ముగిసింది. బోర్డుకు తెలిపిన విధంగా తానా 2021 ఎన్నికల కమిటీ సరైన సమయానికే బ్యాలెట్ల పక్రియను పూర్తి చేసి యుఎస్‍పిఎస్ తపాలా శాఖకు బదిలీ చేసినట్లు ఎన్నికల కమిటీ అధ్యక్షుడు కనకంబాబు ఐనంపూడి పేర్కొన్నారు. వచ్చే వారం అమెరికా-కెనడాల్లోని తానా సభ్యులకు ఈ బ్యాలెట్లు అందే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తానా అధ్యక్ష అభ్యర్థులతోపాటు ఇతర పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ గెలుపుకోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. బ్యాలెట్లు అందే సమయంలోగా వారిని ప్రసన్నం చేసుకునేందుకు అన్నీ విధాలా ప్రయత్నాలను మొదలుపెట్టారు.