తానాలో పతాక స్థాయికి చేరిన వర్గాల పోరు. ఎన్నికలపై సందిగ్ధత.
అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం తానాలో వర్గాల పోరు ఉద్ధృత స్థాయికి చేరింది. ప్రస్తుత అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తదుపరి అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. ఉభయ వర్గాల మధ్య ఏర్పడిన తీవ్రస్థాయి విభేదాలు ఎక్కడికి దారితీస్తాయో అనే అంశంపై తానా సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తానా బోర్డులో తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు వర్గానికి మెజారిటీ ఉంది. తానా రాజ్యాంగం (బైలాస్) ప్రకారం ఎన్నికల నిర్వహణ బాధ్యత బోర్డు చేతుల్లోనే ఉంటుంది. ఈ అధికారంతో తానా బోర్డు అధ్యక్షుడు బండ్ల హనుమయ్య ఎన్నికల నిర్వహణకు నడుం బిగించారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సందేశం పంపారు.
* ఎన్నికల ప్రకటనతో గందరగోళం..
దీని ఆధారంగా ప్రధాన ఎన్నికల అధికారి అయినంపూడి కనకంబాబు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ను బోర్డు కార్యదర్శి మురళి వెన్నం, తానా కార్యదర్శి సతీష్ వేమూరి తమ సొంత మెయిల్ ద్వారా సభ్యులకు సమాచారం అందించారు.
* అడ్డుకుంటున్న అంజయ్య వర్గం
ఎగ్జిక్యూటివ్ కమిటీలో పూర్తి ఆధిక్యం ఉన్న అంజయ్య చౌదరి వర్గం ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగటానికి వీలు లేదని చక్రం తిప్పుతోంది. తమకున్న అధికారాలతో తానా పత్రికలోనూ, వెబ్‌సైట్‌లోనూ ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా అడ్డుకుంటోంది. నిరంజన్ వర్గానికి చెందిన తానా ప్రస్తుత కార్యదర్శి వేమూరు సతీష్ తన అధికారాలు చలాయించకుండా అంజయ్య వర్గం బ్రేకులు వేసింది.
* ఎన్నికలు వాయిదా పడతాయా??
ఈ పరిస్థితుల నేపథ్యంలో తానాలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ ప్రస్తుత పరిస్థితుల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. వెంకటరమణతో పాటు తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ నల్లూరి ప్రసాద్ ఇతర కార్యవర్గ సభ్యులు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి లేఖలు పంపారు. అంజయ్య వర్గం ఎన్నికలు జరగకుండా ఉండాలని, నిరంజన్ వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని తమ శక్తియుక్తులను ప్రయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందో? అని తానా సభ్యులతోపాటు ఎన్నికలపై ఆసక్తి ఉన్నవారు ఎదురుచూస్తున్నారు.