ప్రచారం ముగిసింది...బ్యాలెట్ పోరు మిగిలింది!
ఈ ఎన్నికల కోసం తానా నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేయడంపై దృష్టి సారించింది. ఓటర్లందరికీ 15వ తేదీ నుండి బ్యాలెట్ పత్రాలు పోస్టల్ శాఖ ద్వారా పంపటం జరుగుతుందని వచ్చే 25వ తేదీ నాటికి ఓటర్లు అందరికీ బ్యాలెట్లు అందే విధంగా ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. మే 28వ తేదీ వరకు తానా సభ్యుల నుండి ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలను స్వీకరించే ఏర్పాటు చేశారు.
29న ఎన్నికల ఫలితాలు
కాగా ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పత్రాల లెక్కింపు పక్రియను సియాటెల్‍లోని ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించామని ఆ సంస్థ ఆధ్వర్యంలోనే బ్యాలెట్ పత్రాలను మెయిల్ చేయడం, ఓటర్ల నుండి పత్రాలను తిరిగి స్వీకరించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. మే 29వ తేదీ ఉదయం నుండి స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రానికే ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని వెంటనే ఫలితాలు వెల్లడి అవుతాయని భావిస్తున్నట్లు కమిటీ చైర్మన్ కనకంబాబు తెలిపారు. మే 30వ తేదీన ఎన్నికల్లో గెలిచివారికి ధ్రువపత్రాలను జారీ చేయనున్నారు. తానా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పదవులకు మినహా మిగిలిన పదవులకు పోటీ జరుగుతోంది. దాదాపు 43 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల కమిటీ పేర్కొంది. తానా వెబ్‍సైట్‍లో ఇప్పటికే అభ్యర్థుల పేర్లను, ఎన్నికల పక్రియ వివరాలను ఉంచారు.
ఉధృతంగా ప్రచారం చేసిన నరేన్ కొడాలి టీమ్
తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నరేన్ కొడాలి తమ టీమ్‍తో కలిసి చివరివారంలో వివిధ నగరాల్లో ఉధృతంగా ప్రచారం చేస్తూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను త్రిప్పికొట్టారు. డిట్రాయిట్, హ్యూస్టన్, చికాగో, న్యూజెర్సి, ఛార్లెట్, అట్లాంటా వంటి నగరాల్లో ప్రచారం చేస్తూ తమ టీమ్‍ను గెలిపించాల్సిన అవశ్యకతను తెలియజేశారు.
అట్లాంటాలో ప్రచారం సందర్భంగా నరేన్‍కొడాలి మాట్లాడుతూ వాషింగ్టన్ డీసీలో జరిగిన తానా మహాసభల్లో గానీ, తాను బోర్డ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గానీ తానాకు దాతలు అందించిన నిధుల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయాని ఆధారాలు ఉండి తన తప్పు ఉందని తేలితే తను ఎన్నికల్లో గెలిచినా ప్రమాణస్వీకారం చేయనని ఆయన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.
న్యూజెర్సీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమ టీమ్‍ను గెలిపించడం వల్ల అనుభవానికి పెద్ద పీట వేసినట్లు అవుతుందన్నారు. అనుభవం ఉన్నవారికి పదవులను కట్టబెట్టడం వల్ల తానా మరింతగా ముందుకువెళుతుందని చెప్పారు.
చికాగోలో కొడాలి నరేన్ తన ప్యానెల్‍తో కలిసి ప్రచారాన్ని నిర్వహించి స్థానిక ప్రవాసుల మద్దతును అభ్యర్థించారు. తమ ప్యానెల్ సంఘటితమైన కార్యకర్తలని తమను గెలిపిస్తే తానాను ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తామో వివరించారు.
డిట్రాయిట్ ప్రచార కార్యక్రమంలో నరేన్ మాట్లాడుతూ, సేవా సంస్థలకు ఎన్నికలు మంచిదేనని పరస్పర అనుభవాల మార్పిడికి తద్వారా ఆలోచనలపై విస్తృత చర్చకు అవకాశం దొరుకుతుందని అన్నారు. 15ఏళ్ల అనుభవాలను ఒకరికొకరం పంచుకునేందుకు ఈ ఎన్నికల ప్రయాణం తోడ్పడుతోందని తమలో తాము తానాకు ఏమి చేయాలనే దానిపై ఇంకా లోతైన విచారణ చేసుకుని అందరి సంఘటిత అంగీకారంతో అమలు చేస్తామని అందువలనే తాము ముందస్తు వాగ్దానాలు చేయమని ఆయన అన్నారు.
ఛార్లెట్‍లో ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో సంస్ధను ఏ విధంగా పటిష్టం చేయాలో, దానికి కావాల్సిన భవిష్యత్ ప్రణాళికలపైనే తన ద•ష్టి ఉందని అన్నారు. దాతలను తానాకు విరాళాలు ఇచ్చేందుకు పురికొల్పేది అసంఖ్యాకమైన తానా కార్యకర్తల బలమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం తద్వార నాయకత్వ లక్షణాల బేరీజుకు అవకాశం కలగడం తానాకు చాలా ఆరోగ్యకరం అని తాను విశ్వసిస్తానని నరేన్ పేర్కొన్నారు.
వివిధ నగరాల్లో నిరంజన్ శృంగవరపు వర్గం ప్రచారం
తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నిరంజన్ శృంగవరపు తమ టీమ్‍తో కలిసి చివరివారంలో వివిధ నగరాల్లో ఉధృతంగా ప్రచారం చేశారు.
వర్జీనియా ప్రాంతంలో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో నిరంజన్ శృంగవరపు తన టీమ్‍తో కలిసి మాట్లాడుతూ, తాను ఎన్నికల సమయంలో ఇతరుల్లాగా హామిలు, కల్లబొల్లి కబుర్లు చెప్పి మాయ చేయనని, తానాకు ఏది ముఖ్యమో ఆ పనులు చేసి చూపించడంతోపాటు, కమ్యూనిటీకి అవసరమైన సేవను అందించడమే తనకు ముఖ్యమని అన్నారు. మార్పు అన్న మా నినాదాన్ని మా ప్రచార కార్యక్రమంలోనే చూపించామని చెబుతూ మేము ఇంతవరకు బే ఏరియాలోనూ, ఇతర చోట్ల జరిన ప్రచార కార్యక్రమంలో తానా కుటుంబసభ్యుల మధ్యనే తమ ప్రచారం జరిగిందని ఇదే తాము తీసుకువచ్చిన తొలి మార్పు అన్నారు. అలాగే మా టీమ్‍లో ముగ్గురు మహిళలు, రెండవ జనరేషన్‍కు చెందిన యువకుడు, డాక్టర్లు ఉన్నారని, ఎంతో అనుభవం కలిగిన ఈ టీమ్‍ను ఆదరించి గెలిపించాలని కోరారు. అలాగే తాను తానాలో ఎన్నో పదవులను నిర్వహించానని, ఎక్కడా తేడా రాలేదని, తానా ఫౌండేషన్ చైర్మన్‍గా, ట్రస్టీగా కమ్యూనిటీకి ఎన్నో సేవలందించానని చెప్పారు.
న్యూజెర్సిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ, తనపై ఆరోపణలు చేసేవారికి ఈ వేదిక నుంచే సవాల్ విసురుతున్నానని, నేను చేసిన సేవ, అభివ్నద్ధి కార్యక్రమాలపైనగానీ, అందజేసిన విరాళాలకు సంబంధించిన విషయాలపైగాని ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని ప్రకటించారు. తాను తానాలో ఎన్నో కమిటీల్లో, పదవుల్లో పనిచేశానని, 2015 డిట్రాయిట్ కన్వెన్షన్ కు తాను కోశాధికారిగా కూడా వ్యవహరించానని చెప్పారు. ఆ మహాసభలకు సంబంధించిన ప్రతి పైసా లెక్కను ఆరు నెలల్లో బోర్డుకు సమర్పించి వారి ఆమోదముద్ర కూడా వేయించుకున్నామని, రెండేళ్ల కిందట డీసీలో జరిగిన మహాసభలకు సంబంధించిన లెక్కలకు ఇప్పటికీ దిక్కులేదని అంటూ, దీనిపై అడిగితే ఇస్తాం, ఇస్తాం అంటూ 18నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు.
న్యూయార్క్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ, సేవా సంస్థల్లో పదవి లభించడం గొప్ప కాదని, లభించిన పదవికి నిస్వార్థంగా సేవ చేసి దానికి న్యాయం చేసేవారే నిజమైన సేవకులని అలాంటి వారి సమాహారమే తమ ప్యానెల్ అని అన్నారు. తానాలో ఎన్నో కీలక పదవుల్లో తాను, తన ప్యానెల్ సభ్యులు విశేషమైన సేవలు అందించామని పనిచేసిన సేవకులందరూ తమ ప్యానెల్ ద్వారా పోటీలో ఉండటం తనకు గర్వంగా ఉందన్నారు. ఈ ప్యానెల్‍ను గెలిపించి మరో అవకాశం కల్పిస్తే సంస్థ అభ్యున్నతికి మరింతగా క•షి చేస్తామని అన్నారు.
మొత్తం మీద తానా ఎన్నికల్లో ఓ భాగం పూర్తయింది. ఇక బ్యాలెట్ కార్యక్రమం కూడా పూర్తయితే ఈ ఎన్నికలు తానాలో ఎలాంటి మార్పులను తీసుకువస్తాయోలేదో తెలుస్తుంది.