ASBL Koncept Ambience

అడ్డాడ మెగా వైద్యశిబిరం విజయవంతం

అడ్డాడ మెగా వైద్యశిబిరం విజయవంతం

దేశీ ఎండి సంస్థ, తానా ఫౌండేషన్‌, వీరపనేని బసవయ్య చౌదరి మెమోరియల్‌ ట్రస్ట్‌ కలిసి సంయుక్తంగా పామర్రు మండలం అడ్డాడలో నిర్వహించిన మెగా వైద్యశిబిరం విజయవంతమైంది. డిసెంబర్‌ 19వ తేదీన అడ్డాడ హైస్కూల్‌ వద్ద నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో గుండె, నరాల వ్యాధులు, నేత్ర, దంత వైద్యచికిత్సను రోగులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ, జన్మభూమి రుణం తీర్చుకోలేనిదని అంటూ, పేదలకు ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించిన తానా ఫౌండేషన్‌, దేశీ ఎండి?ఇతర సంస్థలను అభినందించారు. ప్రభుత్వం కూడా?వైద్య రంగానికి  అధిక ప్రాధాన్యమిచ్చి నిధులు కేటాయిస్తోందని అన్నారు. గత 11 నెలల్లో రాష్ట్రంలో 1.30 కోట్ల మందికి వివిధ రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. పేదలకు ఆరోగ్యసేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలకు నూతన భవనాలు, పాత భవనాలకు మరమ్మతులు, వైద్యుల నియామకం,  వివిధ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ వర్ల రామయ్య మాట్లాడుతూ అడ్డాడలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న బసవయ్య చౌదరి ట్రస్ట్‌ నిర్వాహకులను అభినందించారు. తానా ఫౌండేషన్‌ ట్రస్టీ అనిల్‌ వీరపనేని ఈ మెగా వైద్యశిబిరం ఏర్పాటులో కీలకపాత్ర వహించారు.

600 మందికి వైద్య పరీక్షలు ...

అడ్డాడ పరిసర గ్రామాల నుంచి  హాజరైన సుమారు 600 మందికి విజయవాడ ప్రభుత్వ దంత వైద్యశాల, కామినేని హాస్పటల్స్‌ వైద్యులు 25 మంది వైద్య నిపుణులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, మందులు ఉచితంగా అందజేశారు. జనరల్‌ చెకప్‌, దంత, నేత్ర, గుండె వ్యాధులకు చికిత్సలు నిర్వహించారు. 150 మంది విద్యార్థులకు దంత, కంటి పరీక్షలు నిర్వహించారు. 40 రకాల రక్త  పరీక్షలు, ఈసీజీ , 2డీ ఎకో, థైరాయిడ్‌, కిడ్నీ,  లివర్‌, మధుమేహం, బీఎంఐ, బీపీ పరీక్షలు చేశారు.

ఆన్‌లైన్‌ మెడికల్‌ డేటా............

రోగి వ్యక్తిగత మెడికల్‌ డేటాను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని దేశిఎండీ హెల్త్‌ కేర్‌ ఆపరేషన్‌ హెడ్‌ వెంకట్‌ తెలిపారు. ఈ డేటా ప్రకారం తమ సంస్థ వైద్యులు 24 గంటలు ఫోన్‌లో సలహాలు సూచనలు చేస్తారన్నారు. అంగలూరులో తమ సంస్థ 3700 మందికి ఇంటింటికి వెళ్ళి సేవలు అందిస్తోందని అడ్డాడ గ్రామస్థులందరి డేటాను ఇంటింటికి తిరిగి సేకరిస్తామన్నారు. సంవత్సరం వరకు ప్రతి నెలా అడ్డాడలో వైద్య సేవలు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా దేశీఎండీ హెల్త్‌ కార్డులను పంపిణీ చేశారు. అడ్డాడ్‌ సర్పంచ్‌ బలుసు హరికిరణ్‌కు తొలి కార్డును  మంత్రి కామినేని అందచేశారు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ సభ్యురాలు పొట్లూరి శశి, తహసీల్దార్‌ పద్మాకుమారి, వీరపనేని అనిల్‌, ట్రస్టు కోశాధికారి ఎంఆర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ బి.వి. అప్పారావు, సర్పంచ్‌ బలుసు హరికిరణ్‌ పాల్గొన్నారు.


Click here for Photogallery

 

Tags :