కొడాలిలో తానా వైద్యశిబిరం విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలిలో నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరానికి మంచి స్పందన వచ్చింది. స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణమండపంలో నిర్వహించిన ఈ వైద్యశిబిరానికి ఎంతోమంది తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మొవ్వ సమితి మాజీ అధ్యక్షులు దివంగత తుమ్మల వెంకట సుబ్బయ్య స్మారకార్థం వారి మనుమళ్ళు అయినపూరి వంశీ కృష్ణ, వల్లభనేని రాజేష్, వల్లభనేని జగదీష్ తానా సహకారంతో ఈ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎఎంసి చైర్మన్ తుమ్మల చౌదరిబాబు, జనార్థన్ బాబు, జడ్‌పిటిసి సభ్యులు వరలక్ష్మీ, సర్పంచ్ విజయకుమార్, తహసీల్జార్ బాబురావు తదితరులు ఈ శిబిరానికి వచ్చారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాధిక, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ శివకుమార్ దాదాపు 116 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 20వేల రూపాయల విలువ చేసే మందులను పంపిణీ చేశారు.
విజయవాడ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు శివకోటేశ్వరరావు 200 మందికి గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పాలకొల్లు టైమ్స్ కంటి ఆసుపత్రికి చెందిన డాక్టర్ కృ,ష్ణాజీ, డాక్టర్ శారదాదేవి 240 మందికి కంటి పరీక్షలు చేశారు.
Click here for Event Gallery