తెలుగు విద్యార్థులకు ‘తానా’ చేయూత
నిత్యావసర వస్తువుల పంపిణీ
కోవిడ్ 19 వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న అమెరికాలోని తెలుగు విద్యార్థులకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందించటానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్‍ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఎవరైనా ఈ టోల్ ఫ్రీ నెంబర్‍కు ఫోన్ చేస్తే వారికి రెండు వారాలకు సరిపడ సరుకులతో ఒక కిట్‍ను అందిస్తామని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి చెప్పారు. ఒకే ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఫోన్ చేస్తే- వారికి ఒక పిక్‍అప్ పాయింట్ వద్ద ఈ కిట్‍లు ఇస్తాం. లేకపోతే ఇంటికి పట్టుకువెళ్లి అందిస్తామని తానా టీమ్‍స్క్వేర్ ఛైర్మన్ అశోక్ కొల్లా వెల్లడించారు.
తానాకు చెందిన 450 మంది వలంటీర్లు నార్త్ అమెరికాలో ఏ ప్రాంతంలోనైనా ఈ కిట్‍లను అందిస్తారని వెల్లడించారు. ‘‘లాక్‍డౌన్ వల్ల కొందరు విద్యార్థులకు నిత్యావసర వస్తువులు లభించటం లేదు. కొందరికి కార్లు లేక బయటకు వెళ్లలేకపోతున్నారు. దీనికి తోడు యూనివర్సిటీలలో పార్ట్ టైం జాబులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారు. వీరి కోసం ఈ ఏర్పాటు చేశామని అశోక్ తెలియజేశారు. ఏ ఒక్క తెలుగు విద్యార్థి ఆకలితో ఉండకూడదనేది మా ఉద్దేశం. వారికి ఎటువంటి సాయం కావాలన్నా మేం చేస్తామని జయ్ తాళ్ళూరి పేర్కొన్నారు. బియ్యం, కందిపప్పు, ఉప్మా రవ్వ, గోధుమ పిండి, నూనె, జీలకర్ర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు మిరప కాయలు, కారం, మ్యాగి, పెరుగు, బ్రిటానియా బిస్కట్లు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు, క్యారెట్లు, కాబేజీ, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, బంగాళ దుంపలు, వంకాయ, దోసకాయ, టమోటాతో కూడిన కిట్‍ను వారికి అందించనున్నట్లు కూడా జయ్ తాళ్ళూరి తెలిపారు.
నిత్యావసర సరుకులు కావాల్సిన వారు చేయాల్సిన ఫోన్ నెం. 1-855 OUR-TANA.