న్యూజెర్సిలో తానా ఇండిపెండెన్స్ కప్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సి విభాగం ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే కప్ వాలీబాల్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించారు. సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన ఈ వాలీబాల్ టోర్నమెంట్‌లో 32 టీమ్‌లు పాల్గొన్నాయి. 16 గంటలపాటు జరిగిన ఈ టోర్నీలో న్యూజెర్సి, న్యూయార్క్, పెన్సిల్వేనియాతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ఆటగాళ్ళు పాల్గొన్నారు. న్యూజెర్సిలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లోని ఆల్ సీజన్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ టోర్నీని చూసేందుకు ఎంతోమంది ప్రేక్షకులు వచ్చారు. ఈ టోర్నీలో పాల్గొనడం తమకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిందని పలువురు ఆటగాళ్ళు చెప్పారు. ఈ ఆటను చూడటానికి వచ్చిన పలువురు మాట్లాడుతూ ఆటగాళ్ళు గొప్ప ప్రతిభను ప్రదర్శించి ఆడటం చూస్తుంటే ఆనందంగా ఉందని చెప్పారు.
న్యూజెర్సి తానా కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి మాట్లాడుతూ, కమ్యూనిటీని అన్నీరంగాల్లో ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో తానా ఇలాంటి క్రీడాపోటీలను నిర్వహిస్తోందని చెప్పారు. సుమంత్ రామ్‌సెట్టి మాట్లాడుతూ ఆట కమ్యూనిటీని ఏకం చేసే సాధనం అని చెప్పారు. టిఫాస్‌కు చెందిన సుధాకర్ ఉప్పల, రంగ, మధు రాచకుళ్ళ తదితరులు కూడా ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడిసన్‌లోని గోదావరి రెస్టారెంట్ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ సమకూర్చారు.
తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ లక్ష్మీ దేవినేని తదితరులు ఈ పోటీల్లో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ 1, డివిజన్ 2 విభాగాలుగా విభజించి పోటీలను నిర్వహించారు. డివిజన్ 1 కప్‌ను పిఎస్‌సి రాకెట్స్ గెలుచుకుంది. డివిజన్ 2లో హారిస్‌బర్గ్ స్ట్రైకర్స్ విజేతగా నిలిచి ఇండిపెండెన్స్ కప్‌ను గెలుచుకుంది.
అధ్యక్షులు జే తాళ్ళూరి, లక్ష్మీదేవినేని విజేతలకు ట్రోఫీలను, నగదు బహుమతులను అందజేశారు. శ్రీరామ్ అలోకం, విక్రమ్ బెస్ట్ ప్లేయర్ ట్రోఫీని బహుకరించారు. రేఖ ఉప్పులూరి, ప్రవీణ్ రెడ్డి, శ్రీ కొనంకి మెడల్స్‌ను విన్నర్స్, రన్నర్‌అప్ టీమ్‌కు బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాధా నల్లమల, హరిబాబు గంగవరపు, రాము మొక్కపాటి, శ్రీనాథ్, రూపారెడ్డి, రామకృష్ణ వాసిరెడ్డి, సుధీర్ నారెపాలుపు, ప్రవీణ్ రెడ్డి, వంశీ వాసిరెడ్డి, శ్రీకొనంకి తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతానికి కృషి చేశారు.