తానా మహాసభలకు నందమూరి బాలయ్య రాక... టీజర్ విడుదల
యువరత్న బాలకృష్ణ అమెరికాలోని అశేష ప్రేక్షకాభిమానులను మరోసారి పలకరించేందుకు స్వయంగా అమెరికా వస్తున్నారు. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ముఖ్య అతిధిగా నటుడు, నిర్మాత, శాసనసభ సభ్యులు, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హాజరవుతున్నారు.
తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మర్యాదపూర్వకంగా బాలకృష్ణను కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించిన బాలకృష్ణ, డిసెంబర్ 2022లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కోటి రూపాయల విరాళాన్ని తానా ద్వారా అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మహాసభలకు బాలయ్య రాక ప్రవాస తెలుగువారందరికీ మంచి అనుభూతి కలిగిస్తుంది అని 23వ తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలియజేసారు.
ఎన్టీఆర్ శతవసంతోత్సవ సమయంలో జరుగుతున్న, ఈ మహాసభలకు బాలకృష్ణ రావడం నాటి ఎన్టీఆర్ అభిమానులను మరింతగా సంతోషపెడుతోందని అంటూ, తమ మాటను మన్నించి ఈ వేడుకలు వచ్చేందుకు సమ్మతించిన బాలకృష్ణకు, శ్రీమతి వసుంధర గారికి తానా బోర్డ్ సభ్యుడు జాని నిమ్మలపూడి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా తానా బాలకృష్ణ టీజర్‌ను పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఇటీవల విడుదల చేశారు.