తానా 23వ మహాసభల పనులకు శ్రీకారం చుట్టిన జయ్ తాళ్ళూరి, రవి పొట్లూరి
ఫిలడెల్ఫియాలో వచ్చే సంవత్సరం జూలై 2,3,4 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు తానా నాయకులు శ్రీకారం చుట్టారు. తానా మహాసభలు జరిగే ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‍ను తానా అధ్యక్షుడు తాళ్లూరి, తానా కార్యదర్శి రవి పొట్లూరి, న్యూయార్క్, న్యూజెర్సి, ఫిలడెల్ఫియాకు చెందిన తానా ప్రాంతీయ నాయకులు సందర్శించి మహాసభల నిర్వహణకు సంబంధించి కన్వెన్షన్ సెంటర్‍తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా 23వ మహాసభల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తరువాత తానా నాయకులు న్యూజెర్సిలోని సాయిదత్తపీఠం సందర్శించి సాయిబాబాకు పూజలు జరిపారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు జే తాళ్ళూరి మాట్లాడుతూ, తానా 23వ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ మహాసభలకు సంబంధించి పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వారితో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందని చెప్పారు. ఈ మహాసభలకు కన్వీనర్‍గా రవి పొట్లూరి వ్యవహరిస్తారని చెప్పారు. ఈ మహాసభలను దిగ్విజయం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. రవి పొట్లూరి మాట్లాడుతూ, అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి సహకరాంతో ఫిలడెల్ఫియాలో జరిగే మహాసభలను తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ మహాసభల్లో అందరికీ గుర్తుండిపోయేలా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యూజెర్సి తెలుగు ప్రముఖులు ఉపేంద్ర చివుకుల, సాయిదత్త పీఠం పూజారి రఘు శంకరమంచి తదితరులు కూడా తానా నిర్వహిస్తున్న మహాసభలు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జే తాళ్ళూరితోపాటు కార్యదర్శి రవి పొట్లూరి. తానా బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ, తానా ఫౌండేషన్ సెక్రటరీ రవి మందలపు, తానా మిడ్ అట్లాంటిక్ రీజినల్ కో ఆర్డినేటర్ సతీష్ చుండ్రు, న్యూయార్క్ రీజినల్ కో ఆర్డినేటర్ సుమంత్ రామ్‍సెట్టి, న్యూజెర్సి రీజినల్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తితోపాటు నాగరాజు నలజుల ఇతర స్థానిక తానా నాయకులు పాల్గొన్నారు.