న్యూజెర్సిలో 'తానా' సంగీత శిక్షణ తరగతులు జయప్రదం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ (ఎల్‌ఎంఎ) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన అభ్యాసన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని భరత్ రామకా మరియు ఉష రామకా దంపతులు ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ తెలుగు కళా సమితి వారు సహా సమర్పకులుగా వ్యవహరించారు.
తానా ఆధ్వర్యంలో లిటిల్‌మ్యూజిషియన్స్ వ్యవస్థాపకుడు, స్వరగురువు రామాచారి నిర్వహించిన ఈ అభ్యాసన తరగతులలో రెండువారాలపాటు పిల్లలు పెద్దలు మధురమైన పాటలను నేర్చుకొని మనసు పులకరించేలా పాడి అందరినీ మైమరపింపజేశారు. శ్రోతలతో కూడా రామాచారి, శ్రీకాంత్ సండుగు పాటలు పాడించటం విశేషం. ఈ సందర్భంగా తానా అంతర్జాతీయ సమన్వయకర్త లక్ష్మి దేవినేని మాట్లాడుతూ రామాచారి సంగీత నైపుణ్యాన్ని కొనియాడారు. రామాచారి మాట్లాడుతూ తానా ఇస్తున్న ప్రోత్సాహంతో ఎంతోమందికి పాటలను నేర్చుకునే అవకాశం కలిగిందని చెప్పారు. తానా సంస్థ చాలామంది యువ గాయకులను ప్రోత్సహిస్తోందని తానా న్యూజెర్సీ సమన్వయకర్త రాజా కసుకుర్తి తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా కోశాధికారి రవి పొట్లూరికి, తెలుగు కళా సమితి అధ్యక్షులు సుధాకర్ ఉప్పాలకు తానా కార్యనిర్వాహకులందరికి రాజా కసుకుర్తి అభినందనలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి కార్యదర్శి మధు రాచకుళ్ల, తెలుగు కళా సమితి కోశాధికారి రేణు తాడేపల్లి, ఉష దర్శిపూడి, శివాని తానా, సత్య నేమాని ఇంకా ఎందరో తానా సభ్యులు పాల్గొన్నారు. చివరగా భరత్ రామకా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలకు, తల్లితండ్రులకు ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు.