తెలుగు వైభవం చాటేలా తానా మహాసభల ఏర్పాట్లు
తెలుగు టైమ్స్ ఇంటర్వ్యూలో అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తోంది. తెలుగు వైభవం చాటేలా ఈ మహాసభలు ఉంటాయని, అందరికీ నచ్చే కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, ఈ మహాసభలకు ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారని అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు తెలుగు టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
మహాసభల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు ఏమిటి?
ప్రపంచంలోని తెలుగువాళ్ళంతా ఎదురు చూసే తానా మహాసభలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేశాము. సంస్కృతి మనవరం...సేవ మనబలం అనే థీమ్‌తో ఈ మహాసభలను నిర్వహిస్తున్నాము. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే తానా మహాసభల లోగోను తెలుగు రాష్ట్రాల్లో ఆవిష్కరించడం. మొట్టమొదటిసారిగా తానా మహాసభల కిక్ ఆఫ్ ఈవెంట్, లోగో ఆవిష్కరణ అమెరికా బయట జరిగింది. అలాగే ఈ మహాసభల నిర్వహణకోసం లీడర్ షిప్ కమిటీ, అడ్వయిజరీ కమిటీలతోపాటు వివిధ కార్యక్రమాలకోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశాము. ఈ కమిటీలన్నీ దాదాపు 3నెలల ముందునుంచే కార్యక్రమాల ఏర్పాట్లు, ఎలా చేయాలన్న దానిపై తగిన ప్రణాళికలను రూపొందించుకుని పనిచేస్తున్నాయి. అందరూ 24 గంటలు ఈ మహాసభల విజయవంతానికి కృషి చేస్తున్నారు. అందరినీ నచ్చేలా కార్యక్రమాల రూపకల్పనకోసం పలుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చించి కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమాలన్నీ అటు పెద్దలకు, ఇటు యువకులకు, మహిళలకు నచ్చేలా ఉంటుంది.
మహాసభలకు ఎవరెవరు వస్తున్నారు?
ఈ మహాసభల్లో పాల్గొనేందుకు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతోపాటు సాహితీవేత్తలు, కవులు, ఇతర కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మ్యూజిక్ డైరెక్టర్లు వస్తున్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నారు. సంగీత రారాజు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఈ మహాసభల్లో సంగీత కచేరి చేయనున్నారు. ప్రముఖ నేపథ్యగాయని చిత్ర తన గానంతో అందరినీ పరవశులను చేయనున్నారు. మాజీ వైస్ ప్రెసిడెంట్ ముప్పవరపు వెంకయ్య నాయుడుతోపాటు ఎంపిలు కనకమేడల రవీంద్ర, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ వీరితోపాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డా. నూతలపాటి వెంకటరమణ, దాజి డా. కమలేష్ పటేల్, నటకిరీటీ రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నటుడు నిఖిల్ సిద్దార్థ, హీరోయిన్ శ్రీలీల, డిరపుల్ హయాతి, ఆనంది, భవ్యశ్రీ, అనసూయ భరద్వాజ్, విశ్వక్ సేన్, శ్రీకాంత్, నాగినీడు, అశోక్ కుమార్, సుహాస్, రఘుబాబు, రవి వర్మ, భరత్ రెడ్డి, సుధాకర్ కమకుల, డిఫెన్స్ అడ్వయిజర్ జి. సతీష్ రెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌తోపాటు గాయనీ గాయకులు చిత్ర, ఎస్‌పిబి చరణ్, సునీత, శ్వేత మోహన్, కౌసల్య, సుమంగళి, హేమచంద్ర, గీతమాధురి, పృథ్వీ చంద్ర, సాగర్, రీట, మౌనిమ సిహెచ్, అనిరుధ్ సుస్వరం, ఇంద్రావతి చౌహాన్ తదితరులు ఈ మహాసభలకు వస్తున్నారు. దర్శకులు, నిర్మాతలు దిల్‌రాజు, టి.జి. విశ్వప్రసాద్, అనిల్ రావిపూడి, నవీన్ ఎర్నేని, అస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కూడా వస్తున్నారు.
తెలుగుటైమ్స్ ద్వారా మీరిచ్చే సందేశమేమిటి?
ఇది తెలుగువారి పండుగ. ప్రపంచంలోని నలుమూలల నుంచి ముఖ్యంగా తెలుగురాష్ట్రాల నుంచి వచ్చే ప్రముఖులను, సెలబ్రిటీలను, ఇతర రంగాల ప్రముఖులను స్వయంగా కలుసుకునే వేదిక ఇది. ఈ పండుగను మన ఇంటి పండుగగా భావించి అందరూ ఈ మహాసభలకు వచ్చి విజయవంతం చేయాలని టీమ్ తరపున కోరుతున్నాను.
కార్యక్రమాల వివరాలు చెబుతారా?
ఈ మహాసభలను పురస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశాము. అందులో ధీమ్ తానా ఒకటి. అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్నవారిలో ఉన్న ప్రతిభను వెలికితీసే పోటీలు ఇవి. మీపాట, మీ ఆట, మీ అందానికి గుర్తింపు ఇచ్చేలా ఈ పోటీలను తానా ఏర్పాటు చేసింది. ఇప్పటికే జరిగిన పోటీల్లో పలువురు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఫైనల్ పోటీలను మహాసభల వేదికపై నిర్వహిస్తున్నాము. అలాగే సిఎంఇ, హెల్త్ అండ్ ఇన్నోవేషన్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, తానా కళ్యాణమస్తు, సాహిత్య కార్యక్రమాలు, బిజినెస్ సెమినార్‌లు, శ్రీనివాస కళ్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాము.