తానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జే తాళ్ళూరి
వాషింగ్టన్ డీసీలో జరిగిన 22వ తానా మహాసభల ముగింపు వేడుకల్లో తానా కొత్త అధ్యక్ష బాధ్యతలను జే తాళ్ళూరి స్వీకరించారు. ఆయనతోపాటు కొత్త కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయనకు మద్దతుగా నినాదాలిస్తూ ఆయనను ఊరేగింపుగా కార్యక్రమ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపైకి వచ్చిన ఆయనను వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలో ఆశీర్వచనం అందజేశారు. తరువాత జే తాళ్ళూరి తానా కొత్త అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తానా ఓ సేవా సంస్థ మాత్రమే అని అంటూ, ఇది ఓ పార్టీకి, ఓ కులానికి చెందిన సంస్థగా పేర్కొనడం తప్పని చెప్పారు. ఎందుకంటే సతీష్ వేమన హయాంలో అమెరికాలో మరణించిన తెలుగువాళ్ళ మృతదేహాలను ఇండియాకు పంపించేటప్పుడు మరణించిన వ్యక్తి కులాన్ని చూడలేదని, అలాగే అతను ఏ పార్టీ వాడో అని ఆలోచించలేదని ఇలా ఏమీ ఆలోచించకుండా దాదాపు 200 మృతదేహాలను తానా టీంస్క్వేర్‌ద్వారా ఇండియాకు పంపిందని అలాంటప్పుడు తానాపై కులం, పార్టీ ముద్ర వేయడం తగదన్నారు. ఈ?మహాసభల్లో అన్నీ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారని ఇది గమనించాలని కూడా చెప్పారు. రాబోయే కాలంలో తానా తరపున మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తామని, తానాను పటిష్టం చేస్తామని చెప్పారు.
కాగా జే తాళ్ళూరి ఖమ్మంజిల్లా భద్రాచలం దగ్గర విరివెండ గ్రామంలో జన్మించారు. జే తాళ్లూరి 1997లో యుఎస్‌కు హెచ్ 1 వీసా మీద వచ్చారు. Object Soft group కంపెనీని ఏర్పాటు చేసి అందులో పార్టనర్‌గా చేరి దానిని లాభాలబాట పట్టించారు. తరువాత న్యూయార్క్‌లో హాల్‌మార్క్ టెక్నాలజీస్ సంస్థను ఏర్పాటు చేశారు. హెల్త్‌కేర్, అకౌంటింగ్, ఇ- కామర్స్ రంగంలో ఆయన ఏర్పాటు చేసిన హాల్‌మార్క్ గ్లోబల్ టెక్నాలజీస్ కంపెనీ లీడింగ్ కంపెనీగా పేరు తెచ్చుకుంది. హాల్‌మార్క్ ప్రొడక్ట్, నింబుల్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ను హోటళ్ళలోనూ, ఐటీ, కంపెనీలలోనూ, రిటైలర్స్ ఉపయోగిస్తున్నారు. హాల్‌మార్క్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్‌ను అమెరికాలోని అన్నీ ప్రముఖ ఆసుపత్రులలోనూ ఉపయోగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో స్పిన్నింగ్ మిల్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 600 మంది ఇందులో పనిచేస్తున్నారు. న్యూజెర్సి ఐటీ సర్వ్ ఛాప్టర్‌ను ప్రారంభించారు.
ప్రస్తుతం ఆయన హాల్‌మార్క్ గ్రూపు కంపెనీకి చైర్మన్‌గా, ఫర్‌ఫార్మెన్స్ రిసోర్సెస్ న్యూయార్క్ ఇంక్‌కు ప్రెసిడెంట్‌గా, తానా ఫౌండేషన్ ట్రస్టీగా, నింబుల్ అకౌంటింగ్ ఫౌండర్‌గా, సిఇఓగా వ్యవహరిస్తున్నారు. తాళ్ళూరి టెక్స్‌టైల్స్‌కు మేనెజింగ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో నివసిస్తున్న జే తాళ్ళూరి అమెరికాలోనే కాకుండా, మాతృరాష్ట్రంలోని తెలుగు కమ్యూనిటీకి ఎన్నో సేవలను అందిస్తున్నారు. తాళ్ళూరి ట్రస్ట్ తరపున, డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫోరం తరపున ఆయన అందిస్తున్న సేవలు విలువకట్టలేనివి. మైప్రోగ్రెస్ కార్డ్ డాట్ కమ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థుల చదువును, నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. హాల్‌మార్క్ లెర్నింగ్ ల్యాబ్స్ రూపొందించిన డాక్ట్రినాను ఆవిష్కరించి, దీని ద్వారా విద్యార్థులు ప్రొఫెషనల్‌గా ఎదిగేందుకు అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్‌ను అందుబాటులోకి తెచ్చారు.