రైతుల శ్రేయస్సుకు నడుంబిగించిన 'తానా'
ఉత్తర అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోను కమ్యూనిటీకి విశేష సేవలందిస్తూ, తెలుగు భాష, కళల పరిరక్షణకు తోడ్పడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఇప్పుడు రైతుల శ్రేయస్సుకోసం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తానా చైతన్యస్రవంతి వేడుకల్లో రైతు రక్షణకు పెద్దపీట వేసినట్లు తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. ఇందులో భాగంగా పంటలకు పిచికారీ చేసే రసాయనాల ప్రభావం నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఉపయోగపడే రక్షణ సామగ్రితో కూడిన కిట్లను రైతులకు ఉచితంగా అందజేస్తామని ఆయన వివరించారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తానా ప్రతినిధులతో కలిసి రైతులకు అందజేయనున్న రక్షణ కిట్‌ను ఆయన ఆవిష్కరించారు.
రసాయనాలు, పురుగుమందులను రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉపయోగించే సమయంలో అనారోగ్యానికి గురవ్వటంతో పాటు కొన్నిసార్లు మందుల తీవ్రత కారణంగా పొలంలోనే మతి చెందటం జరుగుతోంది! ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో జరిగిన ఈ తరహా రైతు మరణాలు సంభవించాయి. అందులోనూ, రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల వాడకంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తానా ఏర్పాటు చేసిన ''రైతు కోసం'' కమిటీ అధ్యక్షులు కోట జానయ్య పర్యవేక్షణలో ఈ రక్షణ కిట్‌ను రూపొందించటం జరిగిందని సతీష్ వేమన చెప్పారు.
ఈ కిట్‌లో మాస్క్, కళ్లద్దాలు, చేతులకు తొడుగులు, ఒంటికి రక్షణగా నిలిచే దుస్తులు, గొడుగు, టార్చ్ లైట్ వంటి పరికరాలున్నాయి. ఈ కిట్ విలువ రూ. 3 వేలని, ఇలాంటివి తొలిదశలో 25వేల మంది రైతులకు అందజేస్తామని, మలిదశలో లక్ష కిట్ల వరకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. ఈ కిట్లు ఇవ్వడంతోపాటు రసాయనాల ప్రభావం నుంచి రైతులు తమను తాము ఏవిధంగా కాపాడుకోవాలో అవగాహన కల్పించడంతోపాటు కిట్ల వినియోగంపై శిక్షణ ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 జిల్లాల్లోను, తెలంగాణలో 4 జిల్లాల్లోనూ తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ వాహనాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తానా నాయకులు చలపతిరావు కొండ్రకుంట, జానయ్య కోట, లావు అంజయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.