విజయవాడలో 'తానా' కళోత్సవం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ,కృష్ణా జిల్లా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీన విజయవాడలో తానా కళోత్సవం నిర్వహిస్తున్నట్లు తానా కార్యదర్శి లావు అంజయ్య చౌదరి తెలిపారు. మొఘల్‌రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాకారులతో విభిన్నమైన సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి అందరూ రావాలని ఆయన కోరారు. కళోత్సవంలో విద్యార్థులు, నంది బహుమతులు పొందిన నాటికలు, జానపదాలు, బుర్రకథలను ప్రదర్శిస్తారని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్ గద్దె ఆనూరాధ ముఖ్యఅతిథిగా పాల్గొనే కార్యక్రమంలో 150 మంది పేదమహిళలకు కుట్టుమెషిన్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అనంతరం పోస్టర్‌ను విడుదల చేశారు.తానా చైతన్యస్రవంతి కార్యక్రమంలో వివిధ చోట్ల 5కె వాక్, రైతులకు రక్షణ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.