ASBL Koncept Ambience

తానా ఎన్నికల సంక్షోభం.. ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి...

తానా ఎన్నికల సంక్షోభం.. ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి...

తానా సంస్థ కి ఉన్న ఘన కీర్తి కావొచ్చు, పెరుగుతున్న తెలుగు కమ్యూనిటీతో పాటు పెరుగుతున్న తెలుగు నాయకులు కావొచ్చు.. తానా కార్యవర్గ నాయకులు అవ్వాలని ప్రతి ఏటా ముందుకొచ్చే తెలుగు యువత సంఖ్య కూడా పెరుగుతూనే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే... ఆ పెరుగుతున్న నాయకులను ప్రజాస్వామ్య పరంగా ఎన్నుకొనే ప్రక్రియలో పోటీ వాతావరణంలో కోర్టు గుమ్మం ఎక్కిన పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయమే...

ఈ రోజు (20 మే తేదీ)కి ఉన్న పరిస్థితులు ఒక సారి విశ్లేషణ చేస్తే.. కొందరు చేసిన ఆవేశ పూరిత నిర్ణయాలు వలన తెలుగు వారు గర్వంగా చెప్పుకొనే ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ - తానా ఈ రోజు దిక్కు తోచని పరిస్థితి లో కూలబడింది అని చెప్పొచ్చు. తానా నాయకులు పద్మ వ్యూహంలో చొరబడి ముందుకు వెళ్ళి, మళ్లీ తిరిగి వెనక్కి వచ్చే పరిస్థితి లేక, ఎలా రావోలో తేలియక అవస్త పడుతున్నారని చెప్పొచ్చు. వర్గాల కారణంగా ఎన్నికల విషయంలో బోర్డ్‌లో రాజీ పడటానికి ఇరు వైపులా ఉన్న నాయకులు తమ తమ వాదనలతో ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.

ప్రస్తుత పరిస్థితిని పరిశీలిద్దాం..

ఎన్నికల షెడ్యూల్‌:

తానా బై లాస్‌ ప్రకారం జనవరి 2023 లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించటం, అనేక మంది నామినేషన్‌ వేసి ఎన్నికలలో నిలబడి, ప్రచారం మొదలెట్టారు. ఆ ఎన్నికలు 22 ఏప్రిల్‌ నాటికి అయిపోయి, కొత్త నాయకులు ఎన్నిక పూర్తి అయినట్టు తానా ప్రకటించాలి. అయితే ఈ కోర్టు కి వెళ్ళిన తగాదా వలన, కోర్టు ఇచ్చిన ఇంజక్షన్‌ వలన ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. ఏప్రిల్‌ నెలాఖరులో మేరీల్యాండ్‌ కోర్ట్‌ ఇచ్చిన తీర్పు వలన కొత్త సభ్యులను చేర్చుకొనే విషయంలో  కొంత క్లారిటీ వచ్చినా ఇంజంక్షన్‌ ఆర్డర్‌ తొలిగి పోలేదు. ఆ తీర్పు లో కోర్ట్‌ కి వెళ్ళటం వలన అయిన లీగల్‌ ఖర్చుల విషయం కూడా తేలితే... ఆ తీర్పు ప్రకారం ఎన్నికల షెడ్యూల్‌ మళ్లీ ప్రకటించి ముందుకు వెళ్లోచ్చు అని అందరూ అనుకున్నారు. కోర్ట్‌ లో గెలిచిన వారి ఖర్చు ఓడిపోయిన వారు భరించటం ఎప్పటి నుంచో వస్తున్న ప్రక్రియ. ఆ విషయంలో ఒక ఆమోద యోగ్య నిర్ణయం ఉంటుంది.. ఎన్నికలలో ముందుకు వెళతాం అనుకొన్న అనేక మందికి బోర్డ్‌ నిర్ణయాలు నిరాశను కలిగించాయి. ఆ ఖర్చు విషయం లో కూడా ఇరువర్గాలు ఒక ఒప్పందంకి రాలేక పోవటం వలన, మళ్లీ కోర్ట్‌ ఇచ్చే ఫైనల్‌ తీర్పు కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది.

ఎన్నికలలో పోటీ చేస్తున్నామని ముందుకు వచ్చిన అనేక మంది కి అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా ఎప్పుడు జరుగుతాయి? ఆని ఆడుతున్నారు. ప్రచారం సాగించాలా? అపేయాలా? అని కూడా అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు వారి నాయకులు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు.

తానా సభలు:

ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు పూర్తి అయితే, అందరూ కలిసి 7-9 జూలై న జరిగే 23 వ తానా సభలను ఘనంగా జరుపుకోవచ్చు, మళ్లీ స్నేహ పూరిత వాతావరణం వస్తుందని అందరు ఆశించారు. 20 మే (ఈ రోజు) వరకు తుది ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించని నేపథ్యం లో 30 జూన్‌ కి కూడా ఎన్నికలు పూర్తి అవుతాయన్న నమ్మకం పోయింది అని అనేక మంది పెద్దలు బాధ పడుతున్నారు.

ఇప్పటికే రెండు వర్గాలు పెద్ద నగరాలు తిరిగి తమ ప్యానల్‌ లో వున్న అభ్యర్థులను పరిచయం చేసి గెలిపించమని అడుగుతూ ప్రచార సభలు నిర్వహిస్తున్నాయి. ఈ రెండు వర్గాల లో వున్న అనేక మంది ప్రస్తుతం తానా సభల నిర్వహణలో కూడా వున్నారు. ఇలాంటి స్థితి లో తానా సభల నిర్వహణ ఎంత కష్టమైన పని అని, ఆ పని సజావుగా సాగాలని అందరూ కోరుకొంటున్నారు. నాలుగు సంవత్సరాల తరువాత జరుగుతున్న కాన్ఫరెన్స్‌ కనుక అందరి దృష్టి ఈ కాన్ఫరెన్స్‌ మీదే వుంది. ఇప్పటికే కాన్ఫరెన్స్‌ కి వచ్చే అతిథులు, సంగీత విభావరుల ప్రకటన వలన కాన్ఫరెన్స్‌ కి అధిక సంఖ్యలో తెలుగు వారు వచ్చే అవకాశం వుంది. అందుకని ప్రస్తుత  పోటీలో వున్న ఇరు వర్గాలు కాన్ఫరెన్స్‌ నిర్వహణలో సమన్వయం పాటించి కాన్ఫరెన్స్‌ విజయవంతం చేస్తారని ఆశిద్దాం.

రాజ్యాంగ సంక్షోభం:

తానా బై లాస్‌ ప్రకారం, తానా సభల చివరి రోజు (9 జూలై)న కొత్త కార్య వర్గం (2023- 25) బాధ్యతలు స్వీకరించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో, ఎన్నికల ప్రక్రియ పూర్తి అవకపోతే, కొత్త కార్యవర్గం తయారు కాకపోతే ఏమి చెయ్యాలి? అన్న విషయం తానా పెద్దలను వేధిస్తోంది. బై లాస్‌ ప్రకారం ప్రస్తుత బోర్డ్‌ మూడింట రెండు వంతుల అంగీకారంతో ప్రస్తుత కార్య వర్గం మరి కొన్ని రోజులు కొనసాగవచ్చు అనే తీర్మానం చెయ్యవచ్చు. కానీ ప్రస్తుత బోర్డ్‌ లో ఈ తీర్మానానికి కావలసిన మద్దతు లేదు కదా.. మరి ఏమిటి చెయ్యటం ? అని తానా పెద్దలు అందరూ మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ ని ఇంత సంక్షోభం లో పెట్టే పరిస్థితి రావడం చాలా బాధగా వుందని అందరూ అనుకొంటున్నారు. ఇచ్చిన స్వేచ్ఛని ఈ విధంగా దుర్వినియోగ పరిచి సంస్థ పేరుని పాడు చేయవద్దని అంటున్నారు. తాము కూర్చున్న కొమ్మను తామే నరుకుతున్న నాయకులు ఇప్పటికయినా కళ్లు తెరిచి ఎన్నికలు పూర్తి చేసే దిశగా రాజీ నిర్ణయాలు తీసుకోవాలని అందరు కోరుకొంటున్నారు.


వేంకట సుబ్బా రావు చెన్నూరి
ఎడిటర్‌ - తెలుగు టైమ్స్‌

 

 

 

Tags :