పుల్లడిగుంటలో 'తానా' సంక్రాంతి సందడి
గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో సంక్రాంతి సంబరాలు ముందుగానే వచ్చాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు తమ చైతన్యస్రవంతిలో భాగంగా పుల్లడిగుంట వచ్చినప్పుడు వారికి ఘన స్వాగతం లభించింది. తానా అధ్యక్షుడు సతీష్ వేమన, కోశాధికారి రవి పొట్లూరి, నరేన్ కొడాలి, రాజా సూరపనేని తదితరులు పుల్లడిగుంటలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జడ్‌పిటిసి సీతామహాలక్ష్మీతోపాటు టీడిపి నాయకురాలు నన్నపనేని రాజకుమారి కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా సంక్రాంతి హడావుడి కనిపించేలా ఏర్పాట్లను చేశారు. సతీష్ వేమన, నన్నపనేని తదితరులు కోలాటం ఆడటం అందరినీ ఆకట్టుకుంది. రైతులకు తానా అందించే రైతు రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. పేదలకు బియ్యం తదితర వస్తువులను అందజేశారు. తానా నాయకుడు రామ్‌చౌదరి ఉప్పుటూరి స్వస్థలమైన పుల్లడిగుంటలో రామ్‌చౌదరి తల్లితండ్రులు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తున్న సంగతి తెలిసిందే.