తానా సేవలు అభినందనీయం - గంటా శ్రీనివాసరావు
తెలుగు కమ్యూనిటీకి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైజాగ్‌లో సమీకృత దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో తానా ఆర్థిక సాయంతో ఆడిటోరియానికి కుర్చీలు, వంద మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు, దివ్వాంగులకు కృత్రిమ అవయవాలను, ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్స్‌ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి, ఉద్యోగాల నిమిత్తం ఖండాలు దాటి వెళ్లినా, మాతృభూమిని మరిచిపోకుండా సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. తాను ఇటీవల అమెరికా వెళ్లి, ఏపీలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వాలని తానా సభ్యులను కోరారని, దీంతో డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటుకు సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు. తానా నిధులతో ఈ ఏడాది 1,800 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. తానా సహకారంతో జిల్లాలో 30 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు పక్కా నిర్మిస్తున్నామన్నారు. రుద్రభూములు అభివృద్ధికి కూడా తానా సహాయ సహకారాలను అందిస్తున్నదని మంత్రి చెప్పారు.
తానా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ తానా చైతన్య స్రవంతి పేరిట ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో జానపద కళా ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ వేమన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత 40 ఏళ్లలో రూ.220 కోట్లతో వివిధ సంక్షేమ, సేవా కార్యక్రమాలు అమలు చేశామన్నారు. తానా టీమ్ స్క్వేర్ అనే అనుబంధ సంస్థను సుమారు మూడు వందల మంది వలంటీర్లతో ఇటీవల స్థాపించామన్నారు. వీసా, గృహహింస, ప్రమాదాలబారిన పడడం వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం అందించేందుకు వలంటీర్లు అందుబాటులో ఉంటారన్నారు. తానా చైర్మన్ గోగినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 600 ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి, 38వేల మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించినట్టు చెప్పారు. ఇంకా విద్య, వైద్య, సామాజిక రంగాల్లో పలు రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం, తానా కమ్యూనిటీ సర్వీసెస్ సమన్వయకర్త లావు అంజయ్య చౌదరి, తానా క్యాపిటల్ రీజియన్ సమన్వయకర్త జనార్థన్ నిమ్మలపూడి, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎమ్యెల్యే పంచకర రమేష్ బాబు, ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, జడ్‌పీటీసీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు, ఎలమంచిలి ఏఎంసీ చైర్మన్ జనపరెడ్డి నరసింగరావు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, సామాజిక సేవా కార్యకర్త ఇందిరాదేవి, వికలాంగుల పాఠశాల వ్యవస్థాపకుడు పీఎస్‌టీ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.