ASBL Koncept Ambience

పోచంపల్లి చేనేత కార్మికులకు ఆసు యంత్రాలను పంపిణీ చేసిన తానా

పోచంపల్లి చేనేత కార్మికులకు ఆసు యంత్రాలను పంపిణీ చేసిన తానా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కమ్యూనిటీ కోసం వివిధ సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అమెరికాలోని కమ్యూనిటీతోపాటు, మాతృరాష్ట్రాల్లోని ప్రజలకు కూడా సేవా కార్యక్రమాలను చేస్తోంది. ఇందులో భాగంగా పోచంపల్లిలోని చేనేత కార్మికులను ఆదుకోవడానికి వీలుగా ఆసు యంత్రాలను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 1000 యంత్రాలను మొదటి విడతలో పంపిణీ చేయాలని తానా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా యంత్రాల పంపిణీకిగాను తెలంగాణ ప్రభుత్వంతో తానా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. యంత్రాలకు అవసరమయ్యే వ్యయంలో 50శాతం తానా భరిస్తుంది. మిగతా 25శాతంను రాష్ట్ర ప్రభుత్వం, మరో 25శాతాన్ని లబ్దిదారులు భరించేలా ఒప్పందాన్ని చేసుకుంది. 

హైదరాబాద్‌లోని హైటెక్స్‌ సిటీలో అక్టోబర్‌ 12వ తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కె. తారకరామారావు, తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, తానా ఫౌండేషన్‌ ట్రెజరర్‌ శశికాంత్‌ వల్లేపల్లి చేనేత కార్మికులకు ఆసు యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జే తాళ్ళూరి మాట్లాడుతూ, కమ్యూనిటీకోసం తానా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తోందని, గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలోని రైతులకోసం రైతుకోసం పేరుతో వారికి అవసరమైన రక్షణ పరికరాలను పంపిణీ చేశామని చెప్పారు. ఇప్పుడు పోచంపల్లిలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు వీలుగా ఆసు యంత్రాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో 1000 మంది చేనేత కార్మికులను అందిస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రంలోని మిగతా చేనేత కార్మికులకు కూడా ఈ యంత్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశం, తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. 

Click here for Event Gallery

Tags :