తానా అంతర్జాల కవి సమ్మేళనంలో పాల్గొన్న 74మంది సాహితీవేత్తలు
దేశభక్తిని పెంపొందించేలా సాగిన కవుల ప్రసంగాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో 74వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని తానా స్వాతంత్య్ర భారతి- సాహిత్య హారతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆగస్టు 15వ తేదీన 74 మంది సాహితీవేత్తలతో అంతర్జాలం ద్వారా ఈ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం జరిగింది. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహణలో తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి ఆధ్వర్వఞలో జరిగిన ఈ అపూర్వమైన సాహిత్య సమ్మేళనం దేశభక్తిని పెంపొందించేలా సాగింది.
భారతదేశ స్వాతంత్రోద్యమం, జాతీయ సమైక్యత, దేశభక్తి వంటి అంశాలపై భారతీయుల్లో చైతన్యాన్ని కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 74 మంది తెలుగు సాహితీవేత్తలు వచన కవిత్వం, గేయ కవిత్వం, పద్య కవిత్వం వంటి అనేక పక్రియల ద్వారా ఈ కవి సమ్మేళనంలో పాల్గొని స్పూర్తిని కలిగించారు. ప్రపంచ చరిత్రలోనే మహోజ్వల ఘట్టంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం జరిగిన తీరు, మన జాతీయ నాయకులు ప్రదర్శించిన వీరోచిత పోరాటాలు, వివిధ మార్గాల ద్వారా జాతిని ఏకం చేసి బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కలిగించి స్వాతంత్య్రాన్ని సాధించిన తీరును కవిత్వీకరించడం ద్వారా గొప్ప చైతన్యాన్ని తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తానా ఏర్పాటు చేసింది. భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు, కలిగిన భారతీయులందరూ ఒక్కటై భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి మరోసారి జాతీయ సమైక్యతా భావాన్ని ప్రోదిగొల్పటం ఈనాడు అత్యంత ఆవశ్యకమైన విషయం. అది కవుల ద్వారా, కవిత్వం ద్వారా సాధ్యమవుతుంది. పౌరుల్లో దేశభక్తి లేనిది ఏ దేశం రాణించలేదు. దేశం కోసం శక్తిని యుక్తిని ధారపోసి దేశ శ్రేయస్సు కోసం పాటుపడే ఉదాత్తమైన దేశభక్తిని పెంపొందించటానికి గొప్ప మార్గమే సాహిత్యం అని ఈ సదుద్దేశ్యంతోనే ఈ మహా సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జయ్ తాళ్ళూరి వివరించారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య, మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, తమిళనాడు పూర్వ గవర్నర్ పి. ఎస్. రామ్మోహన్ రావు హాజరై సందేశాలు ఇచ్చారు. భారత స్వాతంత్య్ర పోరాటం అజరామరమైనది. ఎందరో దేశభక్థుల త్యాగాల ఫలితమే ఈ స్వరాజ్యం, వారికి ఎప్పుడూ మనం రుణపడి ఉంటాము. 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అపూర్వం గా 74 మంది ప్రముఖ సాహితీవేత్తలతో ప్రపంచ సాహితీ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు తానాకు అభినందనలు, పాల్గొంటున్న కవులకు శుభాభినందనలు’’ అని వారు తమ సందేశంలో పేర్కొన్నారు.
తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ ప్రపంచచరిత్రలో ఎన్నో స్వాతంత్ర పోరాటాలు జరిగాయి. కానీ భారత స్వాతంత్రోద్యమం వాటికంటే విభిన్నమైనది, విలక్షణమైనది. ఒకవైపు పరాయి పాలన నుంచి విముక్తి కోసం స్వరాజ్య పోరాటం చేస్తూనే... మరోవైపు సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం, సాంఘీక సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. అహింసా, శాంతి, సత్యాగ్రహాలతో ప్రపంచంలోని అన్ని స్వాతంత్ర పోరాటాలకు ఆదర్శం గా నిలిచిన పోరాట చరిత్ర మనది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియాతోపే, దాదాబాయి నౌరోజి, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలక్రిష్ణ గోఖలే, మహాదేవ గోవింద రానడే, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్,అనిబిసెంట్, సావర్కర్, అరవింద్ ఘోష్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం, భగత్సింగ్,సుభాష్ చంద్రబోస్, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్‍లాల్ నెహ్రూ, లాంటి ఎందరెందరో దేశభక్తులు తమ జీవితాలను దేశం కోసం అర్పించారు.
మరోవైపు రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వీరేశలింగం పంతులు, నారాయణ గురు, జ్యోతిబా పూలే, అంబేద్కర్ వంటి వారు సాంఘిక సాంస్క•తిక ఉద్యమాలు నిర్వహించారు. అలాగే స్వాతంత్రోద్యమంలో కవులు, రచయితలు నిర్వహించిన పాత్ర ఎంతో గొప్పది. బంకించంద్ర చటర్జీ రచించిన ‘‘వందేమాతర గీతం’’, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘‘అమర్ సోనార్ బంగ్లా’’, ‘‘జనగణమన గీతాలు’’, గరిమెళ్ల సత్యనారాయణ రచించిన ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ లాంటి గీతాలు. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ‘‘భరతఖండంబు చక్కని పాడి ఆవు’’ లాంటి పద్యాలు.... మరెంతో దేశభక్తి సాహిత్యం భరతజాతిని మొత్తాన్ని ఏకం చేసింది. స్వాతంత్రోద్యమం వైపు నడిపించింది. మహామహుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఈరోజు కవులు, రచయితలు తమ కలాలకు పదును పెట్టాలి. భారతీయుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించే కవిత్వం రాయాలి. దేశంలోని అసమానతలు తొలగిపోయి దేశం సుభిక్షంగా, సుసంపన్నంగా అభివ•ద్ధి చెందడానికి అవసరమైన మార్గాలను సూచిస్తూ జనంలో జాతీయ భావాలను, చైతన్యాన్ని కలిగించే కవిత్వం కవులు రాయాలి. ఆ సదుద్దేశంతోనే ఇంత మంది కవులతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కవులే కాక ఇతర కవులు, రచయితలు దేశభక్తిని పెంపొందించే రచనలు రాయాలని కోరుకుంటున్నానని అన్నారు.
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ప్రఖ్యాత సినీ గేయ రచయితలు అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, భువనచంద్ర, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వెన్నెలకంటి, చైతన్య ప్రసాద్, జె.కె.భారవి, శ్యామ్ కాసర్ల, సిరాశ్రీ, వడ్డేపల్లి కృష్ణ, అవధానులు డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్, పాలపర్తి శ్యామలానందప్రసాద్, మీగడ రామలింగస్వామి, మరియు గుమ్మడి గోపాలకృష్ణలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దుబాయ్, ఒమన్, కెనడా వంటి దేశాల నుండే కాక ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, వంటి రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖ సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కవితలను, పద్యాలను, గేయాలను ఆలపించారు. ఆద్యంతం స్వాతంత్య్రస్ఫూర్తిని కలిగించే విధంగా జరిగిన ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. సాంకేతిక సహకారం అందించిన బైట్ గ్రాఫ్ వారికి, ప్రసారం చేసిన మన టీవీ, టీవీ 5 వారికి నిర్వాహకులు ధన్యవాదములు తెలియజేశారు.
పాల్గొన్న సాహితీ వేత్తలు...
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, పౌరాణిక కళారత్న గుమ్మడి గోపాల కృష్ణ, చంద్రబోస్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, భువన చంద్ర, రాంభొట్ల పార్వతీశ్వర శర్మ, చేగొండి అనంత శ్రీరామ్, మీగడ రామలింగస్వామి, చైతన్య ప్రసాద్, దాట్ల దేవదానం రాజు, సుద్దాల అశోక్ తేజ, జాని తక్కెడశిల, రామజోగయ్య శాస్త్రి, నడిమెట్ల యెల్లప్ప లక్ష్మయ్య, శ్యామ్ కాసర్ల, శ్రీమతి।। లేళ్ళపల్లి శ్రీదేవి రమేష్, జె.కె.భారవి, శ్రీమతి।। మొనింగి కామేశ్వరి, వెన్నెలకంటి, పొత్తూరి సీతారామ రాజు, రసరాజు, సినీ గీత రచయిత, నూనె అంకమ్మ రావు, సిరాశ్రీ, జాడ సీతాపతి రావు, వడ్డెపల్లి కృష్ణ, బండ్ల మాధవ రావు, మేఘన శివాని గోగు, పెరుగు రామకృష్ణ, శ్రీదేవి శ్రీకాంత్, ఇందు రమణ, డి.యస్. సందీప్, కె.కె. కృష్ణకుమార్, కొవ్విడి సుధాకర్, సముద్రాల గురుప్రసాద్, నీరజాదేవి గుడి, రామ మనోహర్, శ్రీమతి।। సిందూర, అంబిక రాజు, ఆచార్య వేదాల శ్రీనివాసాచార్య, శ్రీమతి।। అత్తలూరి విజయ లక్ష్మి, ఆనంత్ మల్లవరపు, చేగొండి సత్యనారాయణమూర్తి, చంద్రహాస్ మద్దుకూరి, చక్రావధానుల దవేజి రెడ్డప్ప డా।। అరుణా రెడ్డి, కొరుప్రోలు మాధవ రావు, డా।। కె. గీత, కాలిఫోర్నియా, యం.వి. రామిరెడ్డి, డా।। రమణ జువ్వాడి, మడిపల్లి భద్రయ్య, శారదా పూర్ణ శొంటి, శ్రీమతి।। నెల్లుట్ల రమాదేవి, సత్యం ఉపద్రష్ట, ఫ్రిస్కో, రాయప్రోలు సీతారామ శర్మ, ఉమాదేవి బల్లూరి, షేక్ ఖరీముల్లా, శ్రీమతి।।లక్ష్మి సూరిభొట్ల, అబ్దుల్ రజా హుస్సేన్, లెనిస్ వేముల, యన్.వి.యస్ చారి, జగదీశ్వరన్ పుదూర్, గోజోజు నాగభూషణం, శ్రీనివాస ప్రభల, గణపతి వి.ఆర్. సుజన పాలూరి, శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, విజయ్ సారథి, కుంచె శ్రీ. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, శ్రీమతి ఐశ్వైక, కడిమెళ్ళ వరప్రసాద్, మడిపల్లి దక్షిణా మూర్తి ఈ సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్నారు.