ASBL Koncept Ambience

ఘనంగా తానా తెలుగు భాషా దినోత్సవం

ఘనంగా తానా తెలుగు భాషా దినోత్సవం

హాజరైన తెలుగు భాషా ప్రముఖులు 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. అంతర్జాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షులు జంపాల చౌదరి, వంగూరి ఫౌండేషన్‍ అధినేత డా. వంగూరి చిట్టెన్‍ రాజు, కౌముది నెట్‍ సంపాదకులు కిరణ్‍ ప్రభ, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్‍ కూచిభొట్ల, పారుపల్లి కోదండరామయ్య తెలుగు భాషోద్యమకర్త, నందివెలుగు ముక్తేశ్వర రావు - ఐఎఎస్‍, నల్గొండ జిల్లా పూర్వ కలెక్టర్‍, గారపాటి ఉమామహేశ్వర రావు, హైదరాబాద్‍ విశ్వవిద్యాలయం, మన్నం వెంకట రాయుడు - మనసు ఫౌండేషన్‍, బెంగళూరు,  డా. సి.ఎం.కె రెడ్డి, అల్‍ ఇండియా తెలుగు ఫెడరేషన్‍, చెన్నై, ప్రో. గణేష్‍ తొట్టెంపూడి - హైడెల్‍ బర్గ్ విశ్వవిద్యాలయం, జర్మనీ, శీను. జి - తెలుగు పలుకు, ఆస్ట్రేలియా, సంజీవ నరసింహ అప్పడు - తెలుగు రేడియో/టి.వి వ్యాఖ్యాత, మారిషస్‍ ప్రభుత్వం, మల్లికేశ్వర రావు కొంచాడ, ఆస్ట్రేలియా, అప్పాజీ అంబరీష దర్భా,  తెలుగు ఖతి రూపకర్త, పురుషోత్తమ్‍ కుమార్‍ గుత్తుల - తెలుగు ఖతి రూపకర్త, హైదరాబాద్‍, వీవెన్‍- సాంకేతిక తెలుగు (లేఖిని), హైదరాబాద్‍, వాడపల్లి శేషతల్పశాయి- ఆంధ్రభారతి.కామ్‍, హైదరాబాద్‍, యర్ర (బర్మా) నాయుడు- తెలుగు బడి, బర్మా తదితరులు ఇందులో పాల్గొన్నారు.

తానా అధ్యక్షులు జయ్‍ తాళ్ళూరి, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు ప్రసాద్‍ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్‍ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెలుగువైభవాన్ని మరోసారి అందరికీ తెలియజేసేలా సాగింది. జయ్‍ తాళ్ళూరి మాట్లాడుతూ, మాతృభాష రాని మనిషి మాటలు డొల్ల/ తలపులోని మాట తెలుపు టెల్ల/ తెడ్డు లేని  పడవ వొడ్డు  చేరుట కల్ల/ తెలుగు వీడ కోయి తెలుగు వాడ.’’ అన్నట్లు...మాతృభాష రాని వారి మాటలు నిస్సారంగా ఉంటాయి. ఏ  విషయాన్ని స్పష్టంగా చెప్పలేరు. తెడ్డు లేని పడవ వొడ్డు చేరడం ఎలా సందేహాస్పదమో... మాతృభాష పునాదిగా లేని వారు కూడా తమ లక్ష్యాన్ని చేరుకోవడం సుసాధ్యం కాదు. కాబట్టి మాతృభాషను ఎవరూ వదలకూడదు. ఎందుకంటే మాతృభాష అనేది కేవలం భావ ప్రసారానికి సాధనం మాత్రమే కాదు. ఒక జాతి సంస్కృతికి వారధి మాతృభాష. ఒక జాతి సమున్నత విజ్ఞానానికి సారధి మాతృభాష. ఒక తరం నుంచి మరో తరానికి విలువైన సాంప్రదాయ సంపదను అందించగల అనుసందాత మాతృభాష. మాతృ భాష ఒక నినాదం కాదు..మాతృభాష ఒక జాతి జీవన విధానం! జాతి మనుగడకు అది ప్రధానం..!, ఇటువంటి భాషను మరచిన ఏ జాతికైనా అస్తిత్వం లేదు అని అంటూ, తానా భాషా వికాసం కోసం  గత నాలుగు దశాబ్దాలుగా ఎంతో కృషి చేసింది.  

అనేక మంది కవులను ప్రపంచ వేదిక కు పరిచయం చేసింది. ‘అంతర్జాల తెలుగు మహా నిఘంటువు’’ను రూపొందించింది. ‘‘అమ్మానాన్న గురు వు పద్యార్చన’’  పేరుతో 6 లక్షల మంది విద్యార్థుల తో ఒకే రోజు పద్యాలు పాడించడం. 50 దేశాలలోని  100 సంస్థలతో  కలిసి 18 వేల మందితో ‘‘తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు’’ నిర్వహించడం జరిగింది. అమెరికాలోని ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాష బోధించటానికి ప్రతిష్టాత్మకంగా అమెరికాలోని అనేక నగరాలలో ‘పాఠశాల’ పేరుతో ఒక బృహత్‍ భాషా యజ్ఞం  నిర్వహిస్తోంది.  ప్రపంచంలోని తెలుగు కవులను, భాషా ప్రియులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి భాషా వికాసానికి తోడ్పడే ఉద్దేశంతో ‘‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’’ ఏర్పాటు చేసి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వివిధ దేశాల్లో భాషా సేవలు చేస్తున్న మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిధుల ప్రసంగాలు, సందేశాలు రానున్న భాషా ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలంతా తమతమ ప్రాంతాల్లో జరుగుతున్న తెలుగుభాషా పరిరక్షణ చర్యలను తెలుపుతూ, తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు.

Tags :