ASBL Koncept Ambience

ఖమ్మంలో ఘనంగా 'తానా' సాహితీ సంబరం

ఖమ్మంలో ఘనంగా 'తానా' సాహితీ సంబరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన సాహితీ సంబురాలు అట్టహాసంగా సాగాయి.  సీక్వెల్‌ రిసార్ట్సులో జరిగిన కార్యక్రమాన్ని ప్రముఖ కవి  నగ్నముని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభిచారు. అనంతరం తానా అధ్యక్షుడు జంపాల చౌదరి అధ్యక్షతన జరిగిన సభలో మువ్వా శ్రీనివాసరావు రచించిన సౌభాగ్య, విశ్లేషణ, భ్రమల్లేని బావుకుడు పుస్తకాన్ని ప్రముఖ సినీరచయిత సిరివెన్నెలసీతారామశాస్త్రి చేతులమీదుగా ఆవిష్కరించారు. ప్రముఖ కవి నగ్నమునికి మువ్వా పద్మావతి, రంగయ్య పురస్కారాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజశ్వేరరెడ్డి చేతులమీదుగా అందించారు. సామల రమేష్‌బాబు తానావారి గిడుగు  రామ్మూర్తి అవార్డును, 50వేల నగదును ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌చేతులమీదుగా అందజేశారు. అనంతరం సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఘనంగా సన్మానించారు. కథా రచయిత్రి పి.సత్యావతి, కవి, విమర్శకుడు ప్రసేన్‌కు సాహితీ పురస్కారాలను అందించారు. కళా, సేవా రంగ పురస్కారాలను బాలోత్సవ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ వాసిరెడ్డి రమేష్‌బాబుకు ప్రజ్వలిత అధ్యక్షుడు నాగండ్ల వెంకటదుర్గాప్రసాద్‌కు అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ తానా ఆధ్యర్యంలో సాహితీ పురస్కార సంబరాలు నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. కవులను ప్రోత్సహిస్తూ అవార్డులు అందించడం గర్వకారణమన్నారు. ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ తెలుగుకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. సుద్దాల అశోక్‌తేజ్‌  మాట్లాడుతూ పాటకు, సాహిత్యానికి ఎనలేని  అను బంధం ఉందన్నారు.  ప్రముఖ కవి నగ్నముని, నందిని సిధారెడ్డి, కొలకలూరి ఇనాక్‌, కొత్తగూడెం బాలోత్సవ్‌ కన్వీనర్‌ వాసిరెడ్డి రమేష్‌బాబు సాహిత్యం ఔన్యత్యాన్ని వివరించారు.  జడ్పీచైర్‌ పర్సన్‌ కవిత మాట్లాడుతూ తానా ఉత్సవాలు నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. తానా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ మాతృభూమి పై కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తూన్నామన్నారు. ఈ కార్యక్రమంలో తానా కార్యదరిశ తాతా మధుసూదన్‌, ఫెమా కన్వీనర్‌ మువ్వా శ్రీనివాసరావు తదితరులు సాహిత్య ఔన్నత్వాన్ని వివరించారు. ఈ సందర్భంగా జయరాజు, గోరేటి వెంకన్న తమ జానపద గీతాలతో అలరించారు. ప్రియదర్శిని కళాశాల  విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

తానా సాహితీ పోటీలు

మనం జన్మించిన ఈ మట్టి ప్రతిష్టను పెంచేందుకు విద్యార్థులంతా కృషి చేయాలని ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ పిలుపునిచ్చారు. ఖమ్మంలో జరిగిన ఉత్తర అమెరికా తానా సాహితీ సాంస్కృతిక సంబురాల్లో ఆయన మాట్లాడారు. ప్రకృతి, పర్యావరణం, మాననీయ విలువలను కాపడే బాధ్యత అందరిపై ఉందన్నారు. సాహిత్యం పట్ల అవగాహన పెంచేందుకు విద్యార్థులకు తానా నిర్వహిస్తున్న సాహితీ పోటీలు దోహదపడతాయన్నారు. తానా కార్యదర్శి తాతా మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఖమ్మం జడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  తానా నిర్వహిస్తున్న విద్య, వైద్య సేవల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తానా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ దేశంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సభలో ఖమ్మం నగర మేయర్‌ డా.పాపాలాల్‌,  కొలకనూరి ఇనాక్‌ ప్రసంగించారు. కంచర్ల శ్రీనివాస్‌ రచించిన హుకుం, జ్వలిత రచించిన జ్వలిత ఆనవాళ్లు, ఆంజనేయులు రచించిన దిగివచ్చిన గగనం పుస్తకాలను ఆవిష్కరించారు. తానా ప్రతినిధులు తాళ్లూరి జయశేఖర్‌, గోగినేని శ్రీనివాస్‌, సాహితీవేత్తలు నగ్నముని, తాళ్లూరి పంచాక్షరి, మెర్రి మార్గరేట్‌, వాసిరెడ్డి నవీన్‌,  పత్తిపాక మోహన్‌, రామతీర్థ, కార్యక్రమ కన్వీనర్‌ మువ్వా శ్రీనివాసరావు, కో కన్వీనర్‌ కాటేపల్లి నవీన్‌బాబు, కవి సీతారాం, ప్రసేన్‌ పాల్గొన్నారు.

పాఠశాలల విద్యార్థులకు కవిత్వ శిక్షణ శిబిరం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు నిన్న సాయంత్రం స్కూల్‌ బ్యాగ్‌ నాతో మాట్లాడింది అనే అంశంపై కవిత రచన పోటీ నిర్వహించారు.

కళలతోనే వికాసం - సిరివెన్నెల

కళలు మానవ వికాసాన్ని పెంపొందిస్తాయని, సాహిత్యంతో వ్యక్తిత్వ వికాసం అలవడుతుందని ప్రముఖ సినీ రచయిత  సిరివెన్నెల సీతారామశాస్త్రి పేర్కొన్నారు. ఖమ్మం పువ్వాడ ఆడిటోరియంలో తానా సాహిత్య సాంస్కృతిక సంబురాల్లో భాగంగా జరిగిన సాహిత్యం వ్యక్తిత్వ వికాసం సమాలోచన సదస్సులో ఆయన మాట్లాడారు.  సంస్కృతి, సాంప్రదాయాలకు జన్మనిచ్చింది ఈ పోరుగడ్డ అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను తానా ఆధ్వర్యంలో  తెలుగురాష్ట్రాల్లో జరపడం హర్షణీయమన్నారు. కవిత్వం అనేది ప్రేమతో ఉంటుందన్నారు. విద్వేశాలు రెచ్చగొట్టేది సాహిత్యం కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలపించిన పలు గీతాలు అలరించాయి. మరో  సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ్‌ మాట్లాడుతూ పుస్తకాన్ని కొన్ని గంటలు తలవంటి చదివితే అది జీవితాంతం తోడుగా  ఉంటుందన్నారు. కోయ కోటేశ్వరరావు పద్య, గద్యాలతో సుస్తిరం చేసిన దాశరధి సోదరుల్ని ఎప్పటికీ మరువలేమన్నారు. సాహితీవేత్తలు, అశోక్‌కుమార్‌,  జూకంటి జగన్నాధం, నందిని సిధారెడ్డి తదితరులు సాహిత్యం ఔన్యత్యాన్ని వివరించారు.  తానా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యక్తిత్వ  వికాసం పెంపునకు ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఈ సదస్సులో బోయ కోటేశ్వరరావు, ఎస్‌.నాగేశ్వరరావు, తానా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గోగినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Tags :