ASBL Koncept Ambience

నర్సాపురంలో బావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ‘తానా’

నర్సాపురంలో బావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ‘తానా’

అచ్చమైన తెలుగమ్మాయి ఎలా ఉంటుందంటే బాపు బొమ్మనే చూపించేవారు. తెలుగు అక్షరానికి సొగసు తెచ్చిన చిత్ర కళాకారుడు, దర్శకుడు బాపు అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. పద్మశ్రీ సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ అంటే తెలియకపోవచ్చు కాని బాపు అంటే మాత్రం అందరికీ గుర్తొచ్చేది ఆయన వేసిన చిత్రాలే. తీసిన సినిమాలే. తెలుగమ్మాయికి చిరునామాగా బాపు చిత్రాలు ఉంటే, అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి చిరునామాగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిలిచింది. తానాతో బాపుకు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. 1985లో లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ‘తానా’ సమావేశాలకు హాజరైనప్పటి నుంచి మరణించేవరకు తానాతో ఆయన అనుబంధం కొనసాగింది. తెలుగు సాంస్కృతిక, చిత్రకళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన పుట్టిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బాపు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తానా గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టిన రోజైన డిసెంబర్‌ 15వ తేదీన గోదావరి ఒడ్డున బాపు కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషకు వన్నె తెచ్చిన మహనీయుల జయంతులను అధికార కార్యక్రమాలుగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగానే బాపు జయంతి వేడుకను నిర్వహించాలని 24 గంటల్లో జీవో జారీ చేశామని చెప్పారు. బాపుతో పోల్చుకోదగ్గ వ్యక్తులు తెలుగునేలపై ఇక పుట్టరన్నారు. కార్టూనిస్టుగా ఆయన స్థానం నెంబర్‌1లోనే ఉంటుందని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్మించే కళాక్షేత్రానికి బాపు, వెంకటరమణల పేర్లు పెడుతామని డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ చెప్పారు. బాపు చిత్రాలు చక్కటి సందేశాన్ని అందిస్తాయని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. యువ దర్శకులు, ఆర్టిస్టులు బాపును ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పీతల సుజాత అన్నారు. బాపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు చెప్పారు.

తానా అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అటు అమెరికాలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలుగుజాతికి వెలుగు తెచ్చిన బాపులాంటి వాళ్ళను అందరూ గుర్తుంచుకునేలా ఉండటంకోసం ఇక్కడ బాపు కాంస్య విగ్రహాన్ని తానా ఆవిష్కరించడం జరిగిందన్నారు.

తానా ఉపాధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ, కళాత్మక దృష్టితో సజీవంగా చిత్రాలను వేయడంతోపాటు పౌరాణిక, సాంఘిక చిత్రాలను తీయడంలో దిట్టగా బాపు పేరు తెచ్చుకున్నారన్నారు.

తానా కార్యదర్శి సతీష్‌ వేమన మాట్లాడుతూ, తానాతో బాపుకు ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయన పుట్టి పెరిగిన ఊరిలోనే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాము. ఈరోజు మా సభ్యుల కోరికనెరవేరిందన్నారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ జే తాళ్ళూరి మాట్లాడుతూ, ఫౌండేషన్‌ తరపున ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, ప్రసాద్‌ తోటకూర, తానా 20వ మహాసభల కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ నాదెళ్ళ గంగాధర్‌, తానా బోర్డ్‌ డైరెక్టర్‌ నరేన్‌ కొడాలి, రజని ఆకురాతి, రవి పొట్లూరి, రావు యలమంచిలి, మురళీ వెన్నం, శ్రీకాంత్‌ పోలవరపు, లక్ష్మీ దేవినేని, చలపతి కొండ్రకుంట, అశోక్‌ బాబు కొల్లా తదితరులు పాల్గొన్నారు. 

వీరితోపాటు హైకోర్టు జడ్జి నూతి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ విప్‌లు అంగర రామ్మోహన్‌, చింతమనేని ప్రభాకర్‌, ఎంపిలు గరికపాటి రామ్మోహనరావు, తోట సీతారామలక్ష్మీ, మాగంటి బాబు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

బాపు విగ్రహానివష్కరణ సందర్భంగా నర్సాపురం వీధులన్నీ కోలాహలంగా తయారయ్యాయి. విద్యార్థులకోసం 2కె రన్‌ నిర్వహించారు. విద్యార్థుల కోలాటం, గరన నృత్యాలు, గంగిరెద్దుల విన్యాసాలు, విచిత్ర వేషధారణలు, తెలుగు సంప్రదాయ వాయిద్యాలతో వీధులు హోరెత్తాయి. బాపు టీ షర్టులతో విద్యార్థులు సందడి చేశారు. బాపు జయంత్యుత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గులు, చిత్రలేఖనం, సినిమా క్విజ్‌, పాటల పోటీల్లో విజేతలకు మంత్రులు బహూమతులను అందించారు.

కెనడా, చెన్నై నుంచి వచ్చిన బాపు కుమారులు వేణుగోపాల్‌, వెంకటరమణ పట్టణంలో నివాసం ఉంటున్న బాపు మేనమామ నిడమోలు రామచంద్రరావును, శిల్పి దేవికారాణి ఉడయార్‌ను ఈ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యేలు తానా బృందం ఘనంగా సత్కరించింది. విగ్రహానికి సమీపంలో ఏర్పాటు చేసిన బాపు ఫోటో ఎగ్జిబిషన్‌ వచ్చినవారిని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా ధియేటర్‌లలో బాపు సినిమాలను ఈ వేడుకల సందర్భంగా పురస్కరించారు. బాపు తీసిన చిత్రాల తెరచాపలతో గోదావరిలో ఏర్పాటు చేసిన పడవలు విశేషంగా ఆకర్షించాయి. ఇసుకతో చేసిన బాపు బొమ్మ, కళాకారులు గీసిన బాపు చిత్రాల ప్రదర్శన, సమాచార శాఖ ఏర్పాటు చేసిన బాపు కార్టూన్ల ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు  శ్రమించిన తానా కార్యదర్శి సతీష్‌ వేమన, నరసాపురం ఎమెల్యే మాధవనాయుడును అందరూ అభినందించారు.

స్నేహానికి గుర్తుగా రావి, వేప చెట్లు

బాపు-వెంకట రమణల స్నేహం వచ్చే తరానికి కూడా తెలియజేయాలన్న లక్ష్యంతో విగ్రహం సమీపంలోనే రావి, వేప మొక్కలను నాటారు. మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌, తానా అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని, కార్యదర్శి సతీష్‌ వేమన ఈ మొక్కలను నాటారు.

View Event Gallery

 

 

Tags :