తానా ప్రపంచ తెలుగు సాంస్కృతికోత్సవం... భారీ షెడ్యూల్
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) భారీ ఎత్తున జూలై 24, 25, 26 తేదీల్లో నిర్వహించే ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం షెడ్యూల్‍ను విడుదల చేశారు. తెలుగు భాషా వైభవాన్ని చాటేందుకు ప్రపంచంలోని తెలుగుఅసోసియేషన్లతో కలిసి ఈ వేడుకను చేస్తున్నామని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి తెలిపారు. దాదాపు 50కిపైగా తెలుగు అసోసియేషన్లు ఈ వేడుకల్లో పాలుపంచుకుంటున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని వివిధ అంశాలపై కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
సౌందర్యలహరి, తెలుగు వెలుగు, రాగమంజరి, నాదామృతం, అందెల రవళి, కళాకృతి, రంగస్థలం, భువనవిజయం పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలుగు వెలుగు పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో తెలుగుపద్యాలు, సామెతలు వివరణ, పరభాష లేకుండా తెలుగు పలుకు, తెలుగు కవితాగానం, చందమామ రావే కథలు ఉన్నాయి. రాగమంజరి పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జానపద, శాస్త్రీయ సంగీతాలు, సినిమా, లలిత గీతాలు ఉన్నాయి. నాదామృతం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వయోలిన్, తబల, వీణ, కీ బోర్డ్, మృదంగం, ఫ్లూట్ వంటివి ఉన్నాయి. అందెల రవళి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో జానపద, శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యాలు మొదలైనవి ఉన్నాయి. రంగస్థలం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏకపాత్రాభినయం, మూకాభినయం, ఇద్దరు లేదా ముగ్గురితో సన్నివేశ నటన వంటివి ఉన్నాయి. భువన విజయం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు ఐక్యరాజ్యసమితి పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించనున్నారు.
తెలుగు యూనివర్స్ 2020 పేరుతో ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేశారు. ఇండియన్ హ్యాండ్‍లూమ్స్ ను ప్రమోట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జయ్ తాళ్ళూరి చెప్పారు.
కళాకృతి పేరుతో ఓ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రాయింట్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. రంగవల్లి, చిత్రలేఖనం, అల్లికలు, వ్యంగ్య చిత్రలేఖనం, బంకమట్టి అచ్చులు, సైకత శిల్పాలు పేరుతో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇ-మెయిల్ worldteluguculturalfest@tana.org లో సంప్రదించవచ్చు.
Registration Link : tiny.cc/WTCFReg20