ఘనంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి మరియు ౩౦వ వార్షికోత్సవ వేడుకలు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) నిర్వహించిన దీపావళి మరియు ౩౦వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమై శనివారం రాత్రి ముగిసాయి. శుక్రవారం సంస్థ పూర్వసభ్యులు, కార్యకర్తలు మరియు పోషకదాతల కోసం ఏర్పాటుచేసిన పునస్సమాగమ దినోత్సవ కార్యక్రమoలో కమ్మని విందుతో పాటు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు విచ్చేసిన అందరిని అలరించాయి. గత ౩౦ సంవత్సరాలలో టాంటెక్స్ కు తమ వంతు సాయం చేసిన సభ్యులు సంస్థతో తమ అనుబంధాన్ని, అనుభవాల్ని ఆనందంగా అందరితో పంచుకున్నారు.
ఇక శనివారం ఉదయం స్థానిక మెక్ఆర్థర్ ఉన్నత పాఠశాలలో ‘స్వరమంజరి’ పాటల పోటీ ఫైనల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయకర్త బ్రహ్మదేవర శేఖర్ ప్రారంభిoచగా, న్యాయనిర్ణేతలుగా తెలుగు చిత్ర సంగీత దర్శకులు మున్నా కాశి, స్థానిక సంగీత ఉపాధ్యాయిని సాయి హరిణి, సంగీత దర్శకులు ప్రభల శ్రీనివాస్, వ్యాఖ్యాతగా తోట పద్మశ్రీ వ్యవహరించారు. టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. స్వరమంజరి విజయవంతంగా మూడు రౌండ్లు ముగిసినందుకు ఆనందం వ్యక్తం చేసారు. కార్యక్రమ౦లో అనంతరం సంవత్సరం పొడుగునా నిర్వహించిన క్రీడాకార్యక్రమాల్లో విజేతలైన వారికి టాంటెక్స్ సంస్థ కార్యవర్గ సభ్యులు ట్రోఫీలు అందచేసి అభినందిoచారు.
ప్రాంగణమంతా అందమైన అలంకరణతో ముస్తాబై, అతిధులకు, ప్రేక్షకులకు ఆహ్వానం పలికింది. మధ్యాహ్నం ౩ గంటలకు దీపావళి వేడుకలు అమెరికా జాతీయ గీతంతో, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త పాలేటి లక్ష్మి సందేశం తో ప్రారంభమయ్యాయి. స్థానిక కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సినిమా డాన్సులు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విరామ సమయంలో పసందైన విందు, కళకళలాడుతున్న అంగళ్ళతో ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొంది. భోజనానంతరం ప్రారంభమైన కార్యక్రమంలో అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగు సంస్కృతీసాంప్రదాయలకు పట్టం కట్టి తరాలు మారినా తెరమరుగు కాకుండా రక్షణ ఛత్రంలా నిలబడటo, తెలుగు భాష ను రక్షించుకోవడం, వ్యాప్తి చేయడం, భావితరాలకు అందించడమే టాంటెక్స్ లక్ష్యమని వెల్లడించారు. టాంటెక్స్ స్కాలర్ షిప్ అవార్డ్స్ ఈ సంవత్సరం విద్యార్థులైన మారెళ్ళ పూజ, మల్లవరం జస్వంత్ రెడ్డి, అట్లూరి రాజ్య ని వరించాయి. ఎ.పి.ఎన్.ఆర్.టి సిఇఓ డా. వేమూరు రవి కుమార్ గారు కార్యక్రమంలో పాల్గొని నూతన రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసులు తమ శక్తిమేర పాలు పంచుకోవల్సిందిగా కోరారు. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు యాంకర్ మృదుల వ్యాఖ్యానం తో సందడిగా కొనసాగాయి. నటి అర్చన డాన్స్, ఆల్రౌండర్ మహేష్ మిమిక్రీ ప్రేక్షకులని ఆన౦ది౦ప చేసాయి. ఇక ఇండియా గాట్ టాలెంట్ ఫేం శరవణ ధనపాల్ ప్రదర్శించిన బెలూన్ యాక్ట్, స్ప్రింగ్ మాన్ డాన్స్ డాన్స్ ఈ కార్యక్రమానికే హైలైట్ గా నిలిచి ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేసాయి. సింగర్ సాందీప్ పాటలతో అలరించగా, సంగీత దర్శకులు మున్నా కాశి స్వరమంజరి విజేత కాకర్ల దీపిక కి తన రాబోయే సినిమా ‘మామా ఓ చందమామ’ లో గాయిని గా అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు.
టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు, విచ్చేసిన అతిధి కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన పోషకదాతలకు కార్యదర్శి వీర్నపు చినసత్యం మరియు కార్యవర్గ సభ్యులు ఫలకాలను అందించారు. చివరగా కార్యక్రమ సమన్వయకర్త బ్రహ్మదేవర శేఖర్ వందన సమర్పణ చేస్తూ సంస్థ స్వచ్ఛంద సేవకులకు, పోషకదాతలకు, ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, దేశిప్లాజా, టిఎన్ఐ లకు కృతజ్ఞతలు తెలియచేసారు. భారతీయ జాతీయ గీతంతో కార్యక్రమానికి తెర పడింది.