టాంటెక్స్ ఉగాది వేడుకలు
టాంటెక్స్ సాంస్కృతిక బృంద సమన్వయకర్త సమీర ఇల్లెందుల ఆధ్వర్యంలో, శీలం కృష్ణవేణి అధ్యక్షతన డాలస్‌లో ఏప్రిల్1వ తేదీ జాక్సింగ్లె అకాడమీ ఆడిటోరియంలో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రార్థన గీతంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కూచిపూడి నృత్యాలతోపాటు,''సాయి శరణం'' అనే నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. తరువాత పంచాంగ శ్రవణం వినిపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ హీరో శ్రీకాంత్, డైరెక్టర్ శేఖర్ సూరి విచ్చేశారు. గాయనీ గాయకులు ఉష, యాజిన్‌లు పాడిన పాటలు ప్రేక్షకులను ఉత్తేజపరిచాయి. తరువాత అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి మాట్లాడుతూ అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. 1986లో ప్రారంభమైన టాంటెక్స్ సంస్ధ, సంవత్సరం మొత్తం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. సంస్థకు అన్నివిధాలుగా సాయం చేస్తున్న దాతలందరికీ మిగత కార్యవర్గ సభ్యులకు ఆమె ప్రత్యేక జ్ఞాపికలు అందించారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులు వెన్నల వట్టుకుటి, అర్నవ్‌కొప్పలను గుర్తించి వారికి 'బెస్ట్ అచీవ్‌మెంట్ అవార్డ్స్'ను అధ్యక్షురాలు కృష్ణవేణి, చిన్నసత్యం వీర్నపు అందించారు. ప్రత్యేక అతిధులను కూడా కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించారు.
సంస్థ కార్యక్రమాల్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా అత్యుత్తమ సేవలను అందించిన లక్ష్మీ నరసింహ పోపురి, సాయి బూర్లగడ్డ, పల్లవి తోటకూరలను 'ఉత్తమ స్వఛంద సేవకుల (బెస్ట్వాలంటీర్)' పురస్కారంతో, సత్కరించారు. నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు విందు భోజనం వడ్డించిన అడయార్ ఆనంద భవన్ యాజమాన్యానికి, అన్ని విధాలుగా సహకరించిన కార్యకర్తలందరికి టాంటెక్స్ తరపున ఉత్సవాల సమన్వయకర్త భానులంక కృత్ఞతలు తెలియజేశారు. చివరిగా భారత జాతీయగీతం ఆలపించి ఉత్సవాలను ముగించారు.