వైభవంగా టిఎఎస్‌సి ఉగాది వేడుకలు
దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (టిఎఎస్‌సి) ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది మరియు శ్రీ రామ నవమి వేడుకలను ఏప్రిల్ 08, 2023 శనివారం రోజున ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతా రామకళ్యాణంలో అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. దాదాపు 2000 వేలకు పైగా తెలుగు వాళ్ళు తమకుటుంబ సభ్యులతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా, కోలాహలంగా, ఆనందోత్సాహాలతో, అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలు తొలుతకళ్యాణంతో ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, మైమరపించిన శివ తాండవం, రాగిన్ మ్యూజికల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్, సింగర్ వైష్ణవి పాటలతో, ఆకట్టుకునే బెబక్క అలంకరింగ్ తో దాదాపు 10 గంటలకు పైగా జరిగిన కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం చరిత్రలో మొట్ట మొదటి సారి అత్యద్భుతంగా, వైభవంగా జరిగిన శ్రీ సీతా రామ కళ్యాణం అమోఘమని వచ్చినవారంతా ప్రశంసించారు. జోర్డాన్ స్కూల్ బయటి ప్రాంగణములో పచ్చని మామిడి తోరణాలతో, ఫ్రెష్ పువ్వులతో అందంగా అలంకరించిన కల్యాణ వేదికపౖౖె శ్రీ సీతా రామ కళ్యాణం జరిగింది. స్వయంవరం థీమ్‌తో నిర్మించిన డెకొరేషన్స్ సీతారాముల కటౌట్స్ అందరినీ ఆకట్టుకొంది. భద్రాచలం నుంచి సీతారాముల వారి ఆశీస్సులతో తలంబ్రాలు, వస్త్రాలు, ముత్యాలు, ప్రసాదం వచ్చాయి. పల్లకి సేవ, రథ యాత్ర, కోలాహలంగా కోలాటాలు, మెరుపు నృత్యాలు, చిన్నారుల రామాయణ స్కిట్ అద్భుతంగా, కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలు ఎటుచూసినా అంతారామమయం అన్న చందంగా వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమం విజయవంతానికి టిఎఎస్‌సి అధ్యక్షుడు అమర్ కేతిరెడ్డి, కోటిరెడ్డి కొంగు (ప్రెసిడెంట్ ఎలక్ట్), సెక్రటరీ కృష్ణ శీలం, ట్రెజరర్ శివ కోత, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అనిత కాట్రగడ్డ, శంకర్ సింగంసెట్టి, విష్ణు కలవకూరు, రావు కల్వకోట (మాజీ అధ్యక్షుడు) తదితరులు కృషి చేశారు.