ముఖ్యమంత్రితో టీబీఎస్ చైర్మన్ భేటీ
వైద్య పరికరాలు, ఐటీసీ సిస్టమ్స్ తయారీలో అగ్రగామిగా వున్న టెలిమేటిక్, బయోమెడికల్ సర్వీసెస్(టీబీఎస్) గ్రూపు భారత్‌లో తయారీ కేంద్రాన్ని ప్రారంభించి ఆసియా, ఆగ్నేయాసియా దేశాలకు తమ మార్కెట్‌ను విస్తరించాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తయారీ కర్మాగారాన్ని టీబీఎస్ నెలకొల్పాలని తనను కలిసిన ఆ సంస్థ చైర్మన్, యూకేఐబీసీ విదేశీ వ్యవహారాల జనరల్ మేనేజర్ నికోలా పాంగెర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. దీనిపై స్పందించిన పాంగెర్ ఏపీఈడీబీతో తమ భారత ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, అనుసరిస్తున్న వినూత్న విధానాలు, అమలుచేసిన కార్యక్రమాలను భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో తాము సరిపెట్టుకోవడం లేదని, వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపైనా దృష్టిపెట్టామని పేర్కొన్నారు.
లండన్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన-మౌలికవసతుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఆర్థికాభివృద్ధి మండలి కార్యనిర్వహణ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ వున్నారు.