అంగరంగ వైభవంగా టీడీఎఫ్ బతుకమ్మ, దసరా వేడుకలు
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో బతుకమ్మ, దసరా వేడులకను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బివర్టన్ సిటీ మేయర్ డెన్నీడోయల్ హాజరయ్యారు. పోర్ట్‌లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. పోర్ట్‌లాండ్ మెట్రోసీటీలో మొటమొదటి సారిగా నిర్వహించిన ఈ బతుకమ్మ, దసరా వేడుకలకు దాదాపు 700 మంది పాల్గొన్నారు. ఈ వేడుకలో చిన్నారులు, మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చి ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మల నిమర్జనం తర్వాత మహిళలు గౌరీ దేవీకి మొక్కుకుని, ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తర్వాత బతుకమ్మ విన్నర్స్‌కి టీడీఎఫ్ టీం బహుమతులు అందజేశారు.
దసరా పండుగ రోజు పూజారి జమ్మీచెట్టుకు పూజా చేసి వేదమంత్రాలను అందరి చేత పఠించారు. అనంతరం జమ్మిఆకును ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ అలయ్ బలయ్ చేసుకున్నారు. ఈ వేడుకలో చిన్నారుల రావణ సంహారం స్కిట్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బివర్టన్ మేయర్ డెన్నీడోయల్ మాట్లాడుతూ ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బతుకమ్మ, దసరా వేడుకలను, మహిళల ఆటపాటలు, చిన్నారుల వేసిన స్కిట్‌లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా ఈ వేడకలను ఘనంగా నిర్వహించిన టీడీఎఫ్ టీంని ఆయన ప్రశంసించారు.
టీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీని అనుమాండ్ల వేడుకలలో పాల్గొన్న వారందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన మహిళలను అభినందించారు. వేడుకలను వైభోవోపేతంగా నిర్వహించి, విజయవంతం కావటానికి కృషి చేసిన టీడీఎఫ్ టీంకు నిరంజన్ కూర, శివ ఆకుతో, రఘుశ్యామ, కొండల్‌రెడ్డి పూర్మ, వీరేష్ బుక్క, ప్రవీణ్ అన్నవజ్జల అజయ్ అన్నమనేని, రాజ్ అందోల్ తదితరులను పేరుపేరునా ప్రశంసించారు. అనంతరం వేడుకలో పాల్గొన్నవారందరికీ రుచికరమైన భోజనం వడ్డించారు. చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న పోర్ట్‌లాండ్ ఇండియన్ మ్యూనిటికి, సహకారం చేసిన మిత్రులకు టీడీఏఫ్ టీంకు కృతజ్ఞతలు తెలిపారు.