ASBL Koncept Ambience

మహానాడుకు విశాఖ సన్నద్ధం

మహానాడుకు విశాఖ సన్నద్ధం

తెలుగుదేశం పార్టీ మహానాడు విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ నెల 27,  28, 29 తేదీల్లో జరగనుంది. మహానాడు జరగనున్న ప్రాంగణం జెండాలు, కటౌట్లు, పసుపు పందిళ్లతో కళకళలాడుతోంది. గురువారం నాటికే విశాఖ అంతా పసుపుమయం అయింది. సుమారు 25వేల మంది కూర్చొనేందుకు వీలుగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో జరిగిన అన్ని మహానాడుల కంటే అది అత్యంత భిన్నమైనదని టిడిపి ముఖ్యనేతలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు విశాఖ  మూడంచెల భద్రతలోకి వెళ్లింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఆరుగురు ఎస్పీల స్థాయి అధికారులతో 3 వేల మంది పోలీసులను బందోబస్తు కేటాయించారు. కార్యక్రమానికి హాజరయ్యే వారిలో సుమారు 60 మందికి బందోబస్తును మరింత పటిష్టం చేస్తున్నారు. వేదిక చుట్టు పక్కల మూడంచెల భద్రతను, ఎయూ ప్రాంగణం చుట్టు పక్కల 60 సిసి కెమెరాలను సిద్ధం చేశారు. ఇప్పటికే నగరంలోకి వస్తున్న వాహనాలను ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మూడు రోజులపాటు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ విభాగం గేటును మూసివేయనున్నారు. పాస్‌లున్న  వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తారు. 6 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ సౌకర్యం కూడా కల్పించారు. మహానాడుకు వచ్చిన వాహనాలను దారి మళ్లించడం, సూచనలు, సలహాలు ఇవ్వడానికి 650 మంది ట్రాఫిక్‌ పోలీసులను నియమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ జెడ్‌ ఫ్లస్‌ కేటగిరిల్లో ఉండటంతో  పటిష్ట పోలీస్‌ బందోబస్తు, వ్యక్తిగత భద్రతల విషయంలో గట్టి చర్యలను ప్రభుత్వం తీసుకుంది.

 

 

Tags :