ASBL Koncept Ambience

ఆ అయిదుగురి వల్లనే టీడీపీ విజయం

ఆ అయిదుగురి వల్లనే టీడీపీ విజయం

నంద్యాల ఉప ఎన్నిక విజయం క్రెడిట్ ఆ అయిదుగురికే దక్కుతుంది. ముఖ్యంగా ఐదుగురు మంత్రులు నిర్విరామంగా పనిచేసి, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ వెళ్లినందునే నంద్యాలలో గెలుపు సాధ్యమయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, నారాయణ ఇలా ఈ ఐదుగురు వ్యూహాలు రచించడంలో దిట్టలు. గతంలో ఎన్నికలకు పనిచేసిన అనుభవం నంద్యాలలో పనికొచ్చింది. మంత్రలుగా కాకుండా సాధారణ కార్యకర్తల్లా వారు ప్రజల్లోకి వెళ్లగలిగారు. అంతేకాకుండా సామాజిక వర్గాల వారీగా ఓటర్లను కూడగట్టడంలో సఫలమయ్యారు. దాదాపు నోటిఫికేషన్ విడుదలయి, భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేసినప్పటి నుంచీ మంత్రులు నంద్యాలను వదల్లేదు. దీంతో పాటుగా 25 మంది ఎమ్మెల్యేలను వార్డుల వారీగా ఇన్ ఛార్జిగా నియమించి ప్రతిరోజూ వారితో సమావేశమై పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు చంద్రబాబుకు నివేదించేవారు.

నేతలు జారిపోకుండా…..

వీరితో పాటుగా నంద్యాల ఉప ఎన్నికకు కులాల వారీగా నేతలను తీసుకొచ్చారు. ప్రతిపక్ష నేత జగన్ చేసిన విమర్శలను ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చారు. మంత్రి అఖిలప్రియతో సొంత పార్టీల నేతలతో వచ్చిన విభేదాలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించారు. అంతేకాకుండా చోటా, మోటా నేతలను కూడా టీడీపీలోకి తీసుకురాగలిగారు. కాపు, ముస్లిం, ఆర్యవైశ్య ఓటర్లను నిత్యం కలుస్తూ జారిపోకుండా చూసుకోగలిగారు. అలాగే నంద్యాలలో సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డిని చివరి నిమిషంలో టీడీపీలోకి తీసుకురావడంలోనూ సక్సెస్ అయ్యారు. అలాగే సొంత పార్టీ నేతలు పార్టీని వీడకుండా చూసుకోగలిగారు. ఇరవై రోజుల పాటు నంద్యాలలోనే ఉండి విజయం సాధించిపెట్టిన మంత్రులే ఈ విజయానికి ప్రధాన కారణమని కూడా చెప్పక తప్పదు

 

Tags :