కరోనా సేవల కోసం మరో కోటి రూపాయలు ఇచ్చిన టీమ్ నరేన్ కొడాలి
కరోనాతో ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజలను ఆదుకోవడం కోసం ప్రస్తుత తానా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నరేన్ కొడాలి తన టీమ్‍తో కలిసి తాజాగా కరోనా సేవా కార్యక్రమాలకోసం తానా ఫౌండేషన్‍కు ప్రత్యేకంగా మరో ‘‘కోటి రూపాయలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన తానా ఫౌండేషన్‍కు 70,000 డాలర్లు (యాభై లక్షలు) ఇచ్చినట్లు ప్రకటించారు.
వివిధ ప్రభావవంతమైన సామాజిక, విద్యా పరమైన సేవా కార్యక్రమాల కోసం, గెలుపుతో సంభంధం లేకుండా టీమ్ నరేన్ కొడాలి ఇప్పటికే తానా ఫౌండేషన్ లో 70,000 డాలర్లు (యాభై లక్షలు) జమ చేశారు. నిస్స్వార్ధ సేవా తత్పరతతో, ఇప్పటికే సంస్థలో జమ చేసిన ఈ మొత్తాన్ని 2021 - 2023 మధ్య చేపట్టబోవు పలు సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘‘కరోనా’’ రెండవ దశ పంజావిప్పి కాటేస్తూ, జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో టీమ్ నరేన్ కొడాలి సభ్యులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు కలిసి తమ వంతు సాయంగా ముందుకు వచ్చి కోటి రూపాయల నిధులను సమీకరిస్తామని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవాసంస్థల సమన్వయంతో కరోనా వల్ల సంభవించిన నష్టాన్ని పరిగణించి, అత్యవసర సహాయం మరియు దీర్ఘకాలిక అవసరాల కోసం, సేకరించిన నిధులను దశల వారీగా, ప్రభావవంతంగా ఖర్చు చేస్తామని తెలిపారు.