తానా అధ్యక్ష ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు గెలుపు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021-23 ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు విజయం సాధించారు. అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సియాటెల్‍లోని స్థానిక ఎలక్షన్ ట్రస్ట్ కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చివరకు నిరంజన్ శృంగవరపు గెలిచినట్లు ప్రకటించారు.
తానా ఎన్నికల్లో మొత్తం ఓట్లు 33,875 ఉంటే.. ఈసారి 21 వేలు ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. నిరంజన్‍కు 10,866 ఓట్లు వచ్చాయి. నరేన్ కొడాలికి 9108 ఓట్లు వచ్చాయి. కాగా ఈసారి అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం నిరంజన్ శృంగవరపు, నరేన్ కొడాలి మధ్యనే సాగింది. నరేన్ కొడాలికి మద్దతుగా తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీష్ వేమన ఉంటే.. నిరంజన్ శృంగవరపుకు ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు మద్దతు ఇచ్చారు. చివరకు తానాలో మార్పులు తీసుకువస్తాం అన్న నినాదంతో నిరంజన్ శృంగవరపు చేసిన ప్రచారం ఆయనకు విజయాన్ని సమకూర్చి పెట్టింది.