సదస్సు, కవి సమ్మేళనం, సేవలే ప్రాతిపదికగా మాతృరాష్ట్రంలో టాటా సేవా దినోత్సవాలు
మాతృరాష్ట్రంలోని ప్రజలకు సేవలందించేందుకు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 14 నుంచి 23వ తేదీ వరకు సేవా దినోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రైతులకోసం వర్క్‌షాప్‌లు, ఆరోగ్యశిబిరాలు, పాఠశాలల్లో డిజిటల్ వస్తువుల ఏర్పాటు, వీధిలైట్ల కోసం సోలార్ పరికరాలు, మంచినీటికోసం వాటర్‌ప్లాంట్‌ల ఏర్పాటు, కంప్యూటర్ సిస్టమ్‌ల బహూకరణతోపాటు స్కూళ్ళలో మరుగుదొడ్ల నిర్మాణం, స్కాలర్‌షిప్‌లు వంటి కార్యక్రమాలను సేవా దినోత్సవాల్లో చేయనున్నారు. ఈ సేవాదినాలకు అడ్వయిజర్లుగా డా. మోహన్ పాటలోళ్ల, భరత్ రెడ్డి మందాడి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ప్రాంత కో ఆర్డినేటర్‌గా ద్వారకనాథ్ రెడ్డి ఉంటున్నారు. టాటా నాయకులు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు.
అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అమెరికాలోని తెలంగాణ కమ్యూనిటీకి జాతీయ సంఘం ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ అమెరికా తెలుగు సంఘంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మాతృరాష్ట్రంలో దాదాపు 90 లక్షల విలువైన సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు చెప్పారు.
సంఘం సలహాదారు మోహన్ పాటలోళ్ళ మాట్లాడుతూ, టాటా రాకతో అమెరికాలోని పిల్లలకు, ఇతరులకు తెలంగాణ భాష, సంస్కృతీ, సంప్రదాయాలు, పండగలు తెలిశాయని చెప్పారు. ఇదివరలో బతుకమ్మ పండుగ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు అమెరికా అంతటా ఈ పండుగను అందరూ చేస్తున్నారు. ఇలా టాటా తెలంగాణ సంస్కృతిని తెలియజేయడంతోపాటు తెలంగాణ కమ్యూనిటీకి తనవంతుగా సహాయాన్ని అందిస్తోందని చెప్పారు.
సేవా కార్యక్రమాల కో ఆర్డినేటర్ వంశీ మాట్లాడుతూ, 14 నుంచి 23 వరకు ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పారు. 23వ తేదీన శిలారామంలో మహిళా సాధికారత మీద సదస్సును, కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నెక్లస్‌రోడ్‌లో 5 కె రన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 23వ తేదీన ఆటాతో కలిసి ముగింపు కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేస్తున్నట్లు చెప్పారు. శిల్పకలావేదికలో జరిగే ఈ ముగింపు వేడుకల్లో ప్రముఖ నటుడు సూపర్‌స్టార్ కృష్ణకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు.