ASBL Koncept Ambience

తెలంగాణ ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది?

తెలంగాణ ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది?

తెలంగాణలో జరిగే ఎన్నికలప్రభావం ఇప్పటికే జాతీయస్థాయిలో కనిపిస్తున్నాయి. ఇక ఫలితాలు ఏ విధంగా వచ్చినా, దాని ప్రభావం జాతీయ రాజకీయాలపై ఎలా ఉంటుందన్నదానిపై ఇప్పటికే విశ్లేషకులు పలు కథనాలను వెలువరుస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో ఏర్పడే మహా సంఘటన్‌ నిర్మాణ భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలపై ఆధారపడి కొనసాగుతుందా? అందుకే జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారపర్వంలో కీలకనేతలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడి, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తమ తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు నగరానికి వచ్చారు.  రాహుల్‌ గాంధీతోపాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి వంటి ఉద్ధండులు తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేశారు.

అసెంబ్లీ రద్దు జరిగి ముందస్తు ఎన్నికల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ పూర్తి స్థాయిలోఅంటే అయిదేళ్లపాటు కొనసాగి, లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగి ఉంటే ఇలాంటి హడావుడి కనిపించేంది కాదు. ఉదాహరణకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన రాష్ట్రంలోనూ ఎన్నికలుంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అయ్యేవారు. వస్తే గిస్తే ఒక్కరోజు టిడిపి అభ్యర్థుల కోసం ప్రచారం చేసి వెళ్లేవారు కానీ ఈ విధంగా రోజుల తరబడి ఇక్కడే మకాం వేసి ప్రచారం చేసే అవకాశాలుండేవి కావు. ఇక రాహుల్‌ గాంధీ కూడా దేశ వ్యాప్తంగా ప్రచారంలో ఉండాలి కాబట్టి తెలంగాణకు ఒక్కసారి రావడానికే ఇబ్బందిగా ఉండేది. ఇంకా అనేక మంది కాంగ్రెస్‌ జాతీయ నేతలు కూడా తెలంగాణకు వచ్చే అవకాశాలుండేవి కావు. ప్రధాని నరేంద్ర మోడితోపాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఇతర కేంద్ర మంత్రులు తెలంగాణ ఎన్నికలకు కూడా ఇంతగా ప్రాధాన్యత ఇచ్చే వారు కాదు. వామపక్షాల నేతలు కూడా ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల మైదానంలో తమ వంతు పాత్రను కొనసాగిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంతటి ప్రాధాన్యత లభించడానికి ప్రధాన కారణం ఉంది. ఈ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడిన పీపుల్స్‌ ఫ్రంట్‌లోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్‌, సిపిఐల విజయం పై జాతీయ జాతీయ స్థాయి రాజకీయాలు ఆధారపడి ఉన్నాయనే చర్చ జరుగుతున్నది. ఈ ఫ్రంట్‌ విజయం సాధిసే ఇలాంటి ప్రయోగమే జాతీయ స్థాయిలోనూ కొనసాగించాలనే పట్టుదల అటు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌, టిడిపి అగ్రనేత చంద్రబాబులో పెరుగుతుందని భావిస్తున్నారు. కేంద్రంలో మోడి ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో కెసిఆర్‌ ను గద్దెదింపడానికి కూటమి ప్రయత్నం కావడంతో ప్రస్తుత తెలంగాణ ఎన్నికలు దానికి నాందిగా భావించి, ఈ పార్టీల నేతల విస్త త స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అన్ని విధాలుగా బలాన్ని, బలగాలను వనరులను కేంద్రీకరించుకొని టిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా చంద్రబాబు తెలంగాణ ఎన్నికలకు ముందుగానే హస్తినకు వెళ్లి, రాహుల్‌ గాంధీని స్వయంగా కలవడంతోపాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి జాతీయ స్థాయిలో మహా సంఘటన్‌ ద్వారా కేంద్రంలోని మోడిని గద్దెదింపే ప్రణాళికను రూపొందించారు.

రాహుల్‌తో జరిపిన ఈ చర్చలే తర్వాత తెలంగాణలో మహాకూటమి ఏర్పాటుకు కూడా మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. ముందుగా సిపిఐ, టిడిపిలు కోదండరాంతోమాత్రమే కలసి పోటీచేయాలని చర్చలు జరిపి, తర్వాత కాంగ్రెస్‌ను పెద్దన్నగా ముందుకు తీసుకువచ్చి నాలుగుపార్టీలతో కూటమి ఏర్పాటు చేసి, ఈ ఎన్నికల్లో విజయం కోసం ఒకరికోసం నలుగురు, నలుగురి కోసం ఒక్కరు అన్నట్లుగా నాలుగు పార్టీలు సమన్వయంతో ఎన్నికల బరిలోకి దిగాయి.

ఇలాంటి ప్రయత్నమే జాతీయ స్థాయిలో జరగాలంటే తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్‌ నేత త్వంలోని పీపుల్స్‌ ఫ్రంట్‌ గెలుపొందాలనే విధంగా అటు రాహుల్‌ గాంధీ ఇటు చంద్రబాబు నాయుడు ఉమ్మడి కార్యాచరణతో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేతలు కూడా అవసరమైన సమయంలో చంద్రబాబు వద్దకు వెళ్లి సలహాలు తీసుకొని వ్యూహరచన చేస్తున్నారు.  తనకున్న వనరులు ద్వారా సేకరించిన సమాచారాన్ని చంద్రబాబు కాంగ్రెస్‌ నేతలతో పంచుకున్నారని, కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం, ఆయా ప్రాంతాల్లో ఉన్న లోటుపాట్లు, మరింత సహాయం అందిస్తే విజయం సాధించే సీట్ల వంటి విషయాలపై చంద్రబాబు సలహాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

పైగా రాహుల్‌ గాంధీ కూడా చంద్రబాబును పూర్తిగా విశ్వసించి, జాతీయ స్థాయిలోనూ ఆయన సహాయ,సహకారాలు తీసుకుంటున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను కూడా చంద్రబాబును కలిసి ఎన్నికల కార్యచరణ ప్రణాళికలను రూపొందించాలని రాహుల్‌ ఆదేశించారు. ఈ మేరకు చంద్రబాబు అధిక చొరవ తీసుకొని ఖమ్మం, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జనంలో మమేకం అయి, జై తెలంగాణ నినాదాలతోవారిని కూటమికి అనుకూలంగా మారాలనే విధంగా నినదింప చేస్తున్నారు.

బిజెపి, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర జాతీయ పార్టీల నేతలు అత్యధిక సంఖ్యలో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి, తమతమ అభ్యర్థుల గెలపునకు చేసినప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ కీలక నేతల ప్రచార హోరుతో రాష్ట్రం దద్ధరిల్లింది. రాహుల్‌ గాంధీ అవినీతి విషయాన్ని కీలక ప్రాచారాస్త్రంగా మలుచుకొని అటు ప్రధాని మోడిపై ఇటు ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఎక్కుపెట్టారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయంతో చౌకిదారు చోర్‌ అయ్యారని మోడిని, ప్రాజెక్టుల నిర్మాణంలో పేరుమార్చి వేల కోట్లను స్వాహా చేసిన కెసిఆర్‌-కావో కమిషన్‌ రావుగా మారారని తీవ్ర విమర్శలు చేయడంతోపాటు కారులో ఆ అయిదుగురే ప్రయాణిస్తున్నారని, తెలంగాణ కాదు కెసిఆర్‌ కుటుంబమే బంగారమైందని తీవ్రంగా ధ్వజమెత్తారు.

కాగా ప్రధాని మోడి కూడా కుటుంబ రాజకీయాల వల్ల దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటున్నదని, కాంగ్రెస్‌తోపాటు, టిడిపి, టిఆర్‌ఎస్‌, ఎంఐఎంలను ఓడించి, తెలంగాణలో బిజెపికి అవకాశం ఇస్తే తాను అధిక చొరవ తీసుకొని రాష్ట్రాన్ని సర్వతోముఖాభివద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రచారం పెరగడంతో టిఆర్‌ఎస్‌ తిరిగి ఆత్మగౌరవ ప్రచారాన్ని పెంచింది. జాతీయ నేతల ప్రచారం ఎలా ఉన్నప్పటికీ తెలంగాణలో ఒకవైపు టిఆర్‌ఎస్‌-ఎంఐఎం పార్టీలు.. మరోవైపు కూటమి అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ అన్నట్లు మారింది. ఏదీ ఏమైనా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై పెను ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.

 

Tags :