ASBL Koncept Ambience

యాదాద్రి నారసింహుడి మధుర సాక్షాత్కారం

యాదాద్రి నారసింహుడి మధుర సాక్షాత్కారం

ఏమి సౌభాగ్యము.. ఏమి ఆనందము.. ఏమి అద్భుతము.. అపూర్వం.. అనిర్వచనీయం.. బ్రహ్మాండంలో ఇంతటి దివ్యక్షేత్రాన్ని ఇలలో చూడగలమా? జితేంద్రియుడైన ఆంజనేయుడి క్షేత్రపాలనలో.. జాజ్వల్యమానంగా ఆవరించిన సుదర్శనుడి పర్యవేక్షణలో ఆ దేవదేవుడి పంచనారసింహ రూప దివ్య వైభవం చూడటానికి ఎన్ని కన్నులున్నా ఏమి సరిపోతాయి? దాదాపు ఆరేండ్ల తరువాత ఉగ్ర, జ్వాల, యోగానంద, గండభేరుండ, లక్ష్మీనరసింహ స్వామి స్వయంవ్యక్త రూప దర్శనంతో భక్తజనుల మేని పులకించిపోయింది. తెలంగాణలో ఉజ్వలంగా సాగుతున్న భక్తి ఉద్యమానికి పతాక సన్నివేశమిది.

తెలంగాణకు శిఖరాయమానమైన యాదాద్రి.. నేడు మధ్య యుగాలనాటి రాచరికపు నిర్మాణాలకు దీటుగా అవతరించింది. శిల్పకళా శోభలో కానీ, ఆధ్యాత్మిక విభూతిలో కానీ, ఆలయ సౌందర్యంలో కానీ, నిర్మాణ వైచిత్రిలో కానీ.. ఈ భవ్య ఆలయానికి సాటి లేనే లేదు. యాదాద్రీశుడి వైభవం ఇవాళ కన్నులకు కడుతున్న నిజం.. చేతులతో స్పృశించగలిగే పారవశ్యం.. మనసుకు శాంతినిచ్చే అలౌకికం.

దాదాపు ఆరేండ్లపాటు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పర్యవేక్షణలో.. సాగిన పునర్నిర్మాణ మహా క్రతువు అనంతరం యాదాద్రి గర్భాలయం ద్వారాలు ఏకాదశి సోమవారం రోజున మళ్లీ తెరుచుకున్నాయి. ఏడురోజులపాటు నిర్విరామంగా సాగిన పంచకుండాత్మక మహాయాగం మహా పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. యాదాద్రి నవీన గోపురాలకు ముఖ్యమంత్రి సహా యావత్‌ మంత్రిగణం సమక్షంలో మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమంతా ఈ కార్యక్రమంలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నది. అంతరాలయంలో మూలవరులకు ముఖ్యమంత్రి దంపతుల తొలిపూజల అనంతరం.. ఏండ్ల తరబడి వేచిచూస్తున్న భక్తకోటికి స్వామివారి అనుగ్రహ దర్శనం లభించింది. ఇది ఎన్ని తపస్సుల పుణ్యఫలమో కదా.. ఇది యాదాద్రి వైభవం. తెలంగాణ భక్తి ఉద్యమ సాఫల్యం.

దాదాపు ఆరేండ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. యాదాద్రి స్వయంభువుల దర్శనం సోమవా రం భక్తులకు అనుగ్రహపాత్రమైంది. అత్యద్భుతంగా పునర్నిర్మాణమైన యాదాద్రి భవ్యమైన ఆలయం శోభాయమానంగా వెలుగులీనింది. మహాకుంభ సం ప్రోక్షణ అనంతరం మూలవరులు దివ్యమంగళ రూపు లై దర్శనమిచ్చారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగం సోమవారం ఉదయం పరిపూర్ణం కాగా, ఉదయం 9 గంటలకు శోభాయాత్రతో మహాకుంభ సంప్రోక్షణ పర్వం మొదలైంది. ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్త మిథునలగ్నంలో ఉదయం 11.55 గంటలకు పుష్కరాంశ శుభముహుర్తాన కుం భాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

మహాసంకల్పం

10:45 గంటలకు పరంజా మీదుగా దివ్య విమాన గోపురం పైభాగానికి సీఎం కేసీఆర్‌ చేరుకొన్నారు. 11:40 గంటలకు ప్రధానార్చకుడు నల్లన్‌థిఘల్‌ లక్ష్మీనరసింహాచార్యులు మహాసంకల్పాన్ని ప్రారంభించా రు. సప్తాహ్నిక దీక్షతో ఎనిమిది రోజులుగా బాలాలయంలో నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన కాళేశ్వర పవిత్ర జలాలను మహాకుంభంలోకి చేర్చి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రతువు దాదాపు గంటపాటు జరిగింది. దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు పండితులు వేదాశీర్వచనం అందజేశారు.

సప్తగోపురాలకు ఏకకాలంలో కుంభాభిషేకం

ఉదయం 11:55 గంటలకు పుష్కరాంశ శుభముహూర్తంలో సప్తగోపురాలకు ఏకకాలంలో కుంభాభిషేకాన్ని కాళేశ్వరజలాలతో శాస్ర్తోక్తంగా సంప్రోక్షణ నిర్వహించారు.ప్రధానాలయం నలువైపులా ఐదు అంతస్తుల్లో 55 అడుగుల ఎత్తుతో నిర్మించిన పంచతల రాజగోపురాలకు తొమ్మిదేసి చొప్పున కలశాల ప్రతిష్ఠ జరిగింది. ఏడంతస్తుల్లో 77 అడుగుల ఎత్తులో నిర్మించిన సప్తతల మహారాజగోపురంపై పదకొండు కలశాలను ప్రతిష్ఠించారు.మూడంతస్తుల్లో 33 అడుగుల ఎత్తులో నిర్మించిన త్రితల రాజగోపురంపై ఐదు కలశాలను ఏర్పాటుచేశారు. దివ్య విమాన గోపురంపై ఉన్న శ్రీ సుదర్శన స్వర్ణ చక్రానికి, మిగిలిన ఆరు గోపురాల కలశాలకు, అష్టభుజి మండపాలు, ఉపాలయా ల కలశాలతో కలిపి మొత్తం 82 కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్విక్కుల సమక్షంలో మహాకుం భ సంప్రోక్షణ జరిగింది. పశ్చిమ సప్తతల రాజగోపు రం కలశాలకు మంత్రి జీ జగదీశ్‌రెడ్డి సంప్రోక్షణ నిర్వహించారు. తూర్పు పంచతల రాజగోపురంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, దక్షిణ పంచతల రాజగోపురంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఉత్తర పంచతల రాజగోపురంపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పశ్చిమ పంచత ల రాజగోపురంపై మంత్రి పువ్వాడ అజయ్‌, తూర్పు త్రితల రాజగోపురంపై మంత్రి గంగుల కమలాకర్‌ కుటుంబ సమేతంగా సంప్రోక్షణ నిర్వహించారు.

ఉపాలయాలు, ప్రాకారాలకు అతిథులతో పూజలు..

ఉపాలయాలు, ప్రాకారాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడాళ్వార్‌ సన్నిధి వద్ద అసెంబ్లీ స్పీ కర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయస్వామి సన్నిధి వద్ద మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆగ్నేయ ప్రాకార మండపం-3 వద్ద మంత్రి సబితాఇంద్రారెడ్డి, వాయవ్య ప్రాకార మండపం-18 వద్ద మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి, ఈశాన్య ప్రాకార మండపం-21 వద్ద మంత్రి మల్లారెడ్డి, ఈశాన్య ప్రాకారం మండపం-23 వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈశాన్య ప్రాకా రం మండపం-24 వద్ద మంత్రి హరీశ్‌రావు, శ్రీరామానుజ సన్నిధి వద్ద సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పూజల్లో పాల్గొన్నారు.

స్వయంభువులకు సీఎం దంపతుల తొలి పూజలు

మధ్యాహ్నం 12:13 గంటలకు సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా ప్రధానాలయంలోకి అడుగుపెట్టారు. తొలుత క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకొన్న అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించి పక్కనే ఉన్న గరుడ ఉపాలయాన్ని దర్శించుకొన్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గర్భాలయంలోని స్వయంభువులను దర్శించుకొని తొలి పూజలు జరిపారు. అనంతరం ప్రధానాలయంలో ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత ఉత్తర రాజగోపురం ఎదురు గా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆలయ పునర్నిర్మాణం లో భాగస్వాములైన అధికారులు, స్థపతులను సన్మానించారు. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈఓ ఎన్‌ గీత, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి, ప్రధాన స్థపతి సుందరరాజన్‌, స్థపతి ఆనంద్‌ వేలును సీఎం కేసీఆర్‌ సత్కరించారు.

స్తపతులు ఆర్కిటెక్ట్‌ మధుసూదన్‌, ల్యాండ్‌ స్కేప్‌ అడ్వైజర్‌ రాజేందర్‌రెడ్డి, శిల్పులు బాలాజీ, అందియాప్పన్‌, ముని, వెంకట్‌రెడ్డి, రబానీ, యూనీశ్‌, సుబ్బారావు, మురుగేషన్‌, శ్రవణం, సెల్వకుమార్‌, గణేశన్‌, మనోహరన్‌, సత్తివేలు, సుధాకర్‌, ఖాజా, రవీంద్రాచారి, బందెయ్య, త్యాగరాజన్‌, సె ల్వం, మణి, కృష్ణన్‌, మధు, రవీందరన్‌, జియో టెక్నికల్‌ ఇంజినీర్‌ బాబురావు, వరంగల్‌ నీట్‌ డైరెక్టర్‌ ఎన్‌ వీ రమణారావు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపా ల్‌ రమేశ్‌రెడ్డి, ఆడిటర్‌ మురళీకృష్ణ, ఈఎన్‌సీ (రోడ్స్‌) రవీందర్‌రావు, ఈఎన్‌సీ (బిల్డింగ్స్‌) గణపతిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్‌నాయక్‌, విద్యుత్‌ ఎస్‌ఈ లిం గారెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, విద్యుత్‌ ఈఈ రామారావు, సివిల్‌ ఈఈ దయాకర్‌రెడ్డిని మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సన్మానించారు.

పరిపూర్ణమైన పంచకుండాత్మక యాగం

ఈ నెల 21 నుంచి బాలాలయంలో నిర్వహించిన మహాకుండాత్మక యాగం సోమవారం ఉదయం మహా పూర్ణాహుతితో పరిపూర్ణమైంది. సాయంత్రం శాంతి కల్యాణం, ఆచార్య రుత్విక్‌ సన్మానం, మహాదాశీర్వచనం కార్యక్రమాలు కొనసాగాయి.

తొలిరోజు పోటెత్తిన భక్తజనం

మహాకుంభ సంప్రోక్షణ తరువాత సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వయంభువుల దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించారు. ఆరేండ్ల సుదీర్ఘ విరామం తరువాత మూలవరుల దర్శనం కలుగటంతో భక్తులు క్యూలైన్లలో రాత్రివరకు నిరీక్షించి స్వామివారిని దర్శించుకొన్నారు. మొదటిరోజు నుంచే ఆన్‌లైన్‌ టిక్కెట్ల బుకింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు చెప్పినప్పటికీ సోమవారం పాత పద్ధతిలోనే దర్శనాలను కల్పించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతమని, ధార్మిక, శిల్పకళా నైపుణ్యం కండ్లకు కట్టేలా రూపుదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని భక్తులు కొనియాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు సైతం ఆలయాన్ని సందర్శించుకొని పరామానందభరితులయ్యారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పద్మాదేవేందర్‌రెడ్డి ప్రధానాలయ ప్రాంగణంలో శిల్పకళా వైభవానికి తన్మయులై సెల్ఫీలు దిగారు. పలువురు భక్తులు సైతం ఇదే రీతిన ఆలయ పరిసరాల్లో ఫొటోలు దిగి ఆనందపడ్డారు. రాత్రి 9.30 గంటల వరకు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నట్టు అధికారులు తెలిపారు.

పల్లకీ మోసిన ముఖ్యమంత్రి

సోమవారం ఉదయం 9.20 గంటలకు యాదాద్రికి చేరుకొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులు మొదట వీఐపీ అతిథిగృహానికి చేరుకొన్నారు. అక్కడినుంచి పదిగంటలకు బాలాలయం వద్దకు చేరుకొన్నారు. పది గంటలకు రెండు పల్లకీల్లో సువర్ణ మూర్తులు, ఉత్సవమూర్తుల ఊరేగింపుతో ప్రారంభమైన శోభాయాత్రలో సీఎం దంపతులు పాల్గొన్నారు. శ్వేతఛత్రఛాయలో.. చామరాల వీవనల నడుమ.. వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ సాగిన శోభాయాత్రలో ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి శోభాయాత్ర ప్రవేశిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వామివారి పల్లకీని మోశారు.

చరిత్రకు సాక్షిగా ఉండే అవకాశం దక్కింది: ఎమ్మెల్సీ కవిత

యాదాద్రి ఆలయం పునఃప్రారంభమైన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సోమవారం ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. తెల్లవారుజామునే ‘యాదాద్రి దేవాలయం వద్ద నేటి సూర్యోదయం. రానున్న తరాలకు మార్గనిర్దేశం చేసే వాగ్దానంతో, క్రమశిక్షణను పెంపొందించడానికి, మన విలువలను భావితరాలకు అందించడానికి అందమైన, చరిత్రాత్మకమైన ఆధ్యాత్మిక ప్రయాణం సిద్ధంగా ఉన్నది’ అని ట్వీట్‌ చేశారు. అనంతరం సాయంత్రం ‘రూపుదిద్దుకొంటున్న చరిత్రకు సాక్షిగా ఉండే అవకాశం దక్కింది. యాదాద్రిలో మహాసంప్రోక్షణ యాగంలో పాల్గొని ప్రార్థించా. మంత్రముగ్ధులను చేసే ఆధ్యాత్మిక యాత్ర, పాదయాత్రకు సీఎం కేసీఆర్‌ తలుపులు తెరిచారు. యాదాద్రి ప్రపంచంలోనే అత్యద్భుత ఆధ్యాత్మిక యాత్రకు, నిర్మాణ పనులకు మైలురాయిగా నిలుస్తుంది’ అంటూ వరుసగా మరో రెండు ట్వీట్లు చేశారు.

ఊహకందని అనుభూతి: ఎంపీ సంతోష్‌కుమార్‌

సీఎం కేసీఆర్‌తోపాటు యాదాద్రి వెళ్లిన ఎంసీ సంతోష్‌కుమార్‌ ‘ఊహకందని అనుభూతి.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మన ప్రియమైన, దార్శనిక సీఎం కేసీఆర్‌ చేసిన మహాకుంభ సంప్రోక్షణ ఘట్టాన్ని వీక్షించడం మనందరి అదృష్టం. తడి కండ్లతో ప్రొసీడింగ్స్‌ చూస్తున్నాను. గూస్‌ బంప్స్‌, లాంగ్‌లివ్‌ కేసీఆర్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

మాటల్లో చెప్పలేని అనుభూతి

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా అభివృద్ధిపరిచి, ఆలయాన్ని పునఃప్రారంభించారు. పునర్నిర్మాణ సమయంలో ఆలయ ఈవోగా పనిచేసే అవకాశం రావడం మాటల్లో చెప్పలేని అనుభూతి. దర్శనానికి వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లుచేస్తున్నాం. మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు అద్భుతంగా జరిగాయి. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

– ఎన్‌ గీత, ఈవో యాదాద్రి దేవస్థానం

స్వామి పునర్దర్శనం అనిర్వచనీయం

తెలంగాణ ప్రజల భాగ్యంగా సీఎం కేసీఆర్‌ ఆలయాన్ని దర్శించుకొన్న సమయంలో యాదాద్రి ఆలయాన్ని యథాశక్తిగా అభివృద్ధి పరుస్తున్నట్టు తెలిపారు. వెయ్యి కోట్లతో వెయ్యి విధాలుగా విస్తృతస్థాయిలో ఆలయం అభివృద్ధి కావడం.. నేను ప్రధానార్చకుడిగా ఉన్న సమయంలో జరుగడం అనిర్వచనీయమైన ఆనందంగా ఉన్నది. వారం రోజులుగా పంచకుండాత్మక మహాయాగాలు, అభిషేకాలు, హవనాలు, ఆదివాసాలు, అభిషేక పర్వాలతో యాదాద్రి పులకించింది.

-నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధానార్చకుడు, యాదాద్రి దేవస్థానం

 

 

Tags :